అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న పార్టీలు, అభ్యర్థుల భవితవ్యం మరో మూడు నాలుగు గంటల్లో తేలిపోనుంది. ఇవాళ ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం 31 జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 9 గంటల నుంచి ఫలితాల సరళి తెలుస్తుంది. 11 గంటల వరకు ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవనుందో స్పష్టమవుతుంది. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టంగా చెప్పకపోవడం, ఏ పార్టీలోనూ కచ్చితంగా గెలుపు మాదే అనే ధీమా కనిపించకపోవడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాల కోసం కేవలం తెలుగు ప్రజలే కాకుండా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మూడు నెలల్లో మారిన రాజకీయం...
పక్కా ప్లాన్ తో, గెలుపుపై ధీమాతోనే ఎనిమిది నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసే ముందస్తు ఎన్నికలకు వచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. కచ్చితంగా 100 సీట్లు గెలుస్తామని మొదటి నుంచీ ఆయన చెబుతూ వచ్చారు. ఒకానొక సమయంలో అయితే ఏకంగా 106 సీట్లు కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, మూడు నెలల క్రితం అసెంబ్లీ రద్దు చేసినప్పుడు ఉన్న పరిస్థితులు తర్వాత మారాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా పూర్తి విశ్రాంతి దశలో ఉంది. ఇక విపక్షల మధ్య కూడా ఎటువంటి ఐక్యత లేదు. కానీ, అసెంబ్లీ రద్దు కాగానే కాంగ్రెస్ చొరవ తీసుకుని కూటమి కట్టింది. కేసీఆర్ ను గద్దె దింపడమే ధ్యేయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పెద్దలు ప్రజాకూటమిని ఏర్పాటు చేశారు. ఒకదశలో కేసీఆర్ కి ఎదురేలేదు అనే పరిస్థి నుంచి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి కాంగ్రెస్ వెళ్లింది. మొత్తానికి టీఆర్ఎస్ - ప్రజాకూటమి మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
రెండు పార్టీల్లోనూ ధీమా...కానీ...
ఎగ్జిట్ పోల్స్ కొన్ని టీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేయగా మరికొన్ని మాత్రం హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం 75-80 స్థానాలు గెలుస్తామని చెబుతోంది. టీఆర్ఎస్ ఇప్పటికే 100 సీట్లు గెలుస్తామంటోంది. అయితే, రెండు పార్టీల్లోనూ ధీమా కనిపించడం లేదు. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 73.20 శాతం పోలింగ్ నమోదు కావడంతో అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని కాంగ్రెస్ చెబుతోంది. టీఆర్ఎస్ మత్రం ప్రభుత్వానికి సానుకూలత ఎక్కువగా ఉన్నందునే ఎక్కువ పోలింగ్ నమోదైందంటోంది. మొత్తానికి కూటమి కట్టడం, బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని అంచనా ఉన్నాయి. ఇక కేసీఆర్ నాలుగున్నరేళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఉన్న సానుకూలత, ఆయనపై నమ్మకమే గెలిపిస్తామని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. అయితే, ఒకవేళ హంగ్ వచ్చే అవకాశాన్ని కూడా కొట్టివేయకుండా కేసీఆర్ ఎంఐఎం అధినేతను పిలిపించుకుని సంపూర్ణ మద్దతు తీసుకుని ముందు జాగ్రత్త పడ్డారు. కాంగ్రెస్ కూడా స్వతంత్ర అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైంది. మొత్తానికి మరో మూడు నాలుగు గంటల్లో తెలంగాణలో ‘కారు’ జోరు ఉంటుందా... ‘హస్త’వాసి ఫలిస్తుందా అనేది తేలిపోనుంది.