కన్నడ వ్యూహాలు ఇక్కడ వర్కవుట్ అవుతాయా..?

Update: 2018-11-23 08:00 GMT

డీ.కే.శివకుమార్.. కర్ణాటక కాంగ్రెస్ లో కీలక నేత. ఆ పార్టీకి ట్రబుల్ షూటర్. హైకమాండ్ కి నమ్మినబంటు. ఆయనపై ఎటువంటి బాధ్యతలు పెట్టినా కచ్చితంగా నెరవేరుస్తాడని కాంగ్రెస్ అధిష్ఠానానికి గట్టి నమ్మకం. కన్నడ రాజకీయాల్లో డీకే స్పెషల్. 27 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కాంగ్రెస్ అంటే డీకే కు ప్రాణం. తాను ఎదిగిందీ, తనను తొక్కేసిందీ కాంగ్రెస్ లోనే. అన్ని అర్హతలు ఉన్నా ఆశించిన పదవులు ఇవ్వలేదు ఆ పార్టీ. కానీ, ఏనాడు పార్టీ గిసిన గీత జవదాట లేదు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడైన డీకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. వాస్తవానికి తెలుగు ప్రజలకు డీకే పరిచయం ఉన్న వ్యక్తేం కాదు. కాబట్టి ఇక్కడి ప్రజలను ఆయన ఏమాత్రం ప్రభావితం చేయగలిగిన వ్యక్తి కాదు. అయితే, పార్టీ పనులు చక్కబెట్టడంలో, వ్యూహాలు పన్నడంలో మాత్రం డీకే మహాముదురు. అసలు ఎవరీ శివ కుమార్ ఆయన రాజకీయ జీవితం ఏంటో చూద్దాం.

వ్యూహరచనలో దిట్ట...

57 ఏళ్ల శివకుమార్ 1989లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే 27 ఏళ్ల వయస్సుకే ఎమ్మెల్యేగా విధానసభలో అడుగుపెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప ఏకంగా శివకుమార్ కు జైళ్ల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 29 ఏళ్లు మాత్రమే. చిన్న వయస్సులోనే మంచి రాజకీయ అవకాశాలు దక్కించుకున్న ఆయన ప్రతికూల పరస్థితులూ, రాజకీయ వేధింపులు కూడా ఎదుర్కొన్నారు. ఎస్.ఎం.కృష్ణ హయాంలోనూ మంత్రిగా పనిచేసిన శివకుమార్ 2002లో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికల్లో దేవెగౌడపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినా 2004లో మళ్లీ అదే సీటులో ఓ జర్నలిస్టును నిలబెట్టి దేవెగౌడపై గెలిపించి ప్రతీకార విజయం సాధించారు. డీ.కే.శివ కుమార్ పలు కీలక సందర్భాల్లో తన వ్యూహాలతో పార్టీకి ఎంతో మేలు చేశారు. 2002లో మహారాష్ట్రలో అప్పటి ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ ప్రభుత్వం పడిపోయే దిశలో ఎమ్మెల్యేలను క్యాంపు కోసం కర్ణాటకకు పంపి వీరి బాధ్యతను శివకుమార్ పైన పెట్టారు. ఎమ్మెల్యేలను జాగ్రత్తగా ఉంచి ప్రభుత్వం నిలబడేలా చేశారు. ఇక గత సంవత్సరం జరిగిన గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ ను ఓడించేందుకు బీజేపీ అన్నిరకాల ప్రయత్నాలూ చేసింది. అప్పుడు కూడా గుజరాత్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు తీసుకువచ్చి... వారిని చేజారకుండా చూసి అహ్మద్ పటేల్ రాజ్యసభ సభ్యుడయ్యేలా చూశారు. ఆయనపై ఇన్ కం ట్యాక్స్, ఈడీ దాడులు జరిగినా వెనుకడుగు వేయలేదు. ఇక ఆరునెలల కిందట జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ బలనిరూపణ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేజారకుండా డీకేనే చూసుకున్నారు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కంచుకోట అయిన బళ్లారి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ విజయం వెనుక కూడా డీకే వ్యూహాలే కారణం.

రెబల్స్ ను బుజ్జగించడంలో కీలకంగా...

ఎన్నికల వ్యూహాలు పన్నడం దిట్ట అయిన డీ.కే.శివకుమార్ కి ప్రస్తుతం రాహుల్ గాంధీ తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. రెబల్స్ ను బుజ్జగించేందుకు వేసిన త్రిసభ్య కమిటీలో శివకుమార్ ఒకరు. దీంతో వెంటనే ఆయన హైదరాబాద్ చేరిపోయి తిరుగుబాటుదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చాలావరకు రెబెల్స్ ను దారిలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఓ స్థానంలో బలమైన అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వకుండా బలహీన అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చారని డీ.కే గుర్తించి టిక్కెట్ దక్కిన అభ్యర్థితోనే అసహనం వ్యక్తం చేశారట. మీకు విజయావశాకాలు తక్కువున్నాయని, అయినా టిక్కెట్ తెచ్చుకున్నారు గనుక కచ్చితంగా గెలవాలని ఫోన్ చేసి మరీ సూచనలు చేశారట. ఇక సోనియా గాంధీ సభ ఏర్పాట్లలో కూడా డీ.కే చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలు అయిపోయే వరకు కూడా డీ.కే ఇక్కడే ఉండనున్నారట. ఆయన మరి ఈ 15 రోజులు ఎటువంటి వ్యూహాలు పన్నుతారో... కన్నడ వ్యూహాలు తెలంగాణ వర్కవుట్ అవుతాయో లేదో చూడాలి.

Similar News