టీఆర్ఎస్ నేత, సీఎం కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్‌రావుకు పరాభవాల పరంపర కొనసాగుతూనే ఉందా..? ఆయనను పార్టీలో, ప్రభుత్వంలో గుర్తింపు సమస్య వెంటాడుతూనే ఉందా...? మళ్లీ మళ్లీ అన్యాయం జరుగుతూనే ఉందా..? అంటే మాత్రం పార్టీ ప్లీనరీ సందర్భంగా జరుగుతున్న పరిణామాలు నిజమనే అంటున్నాయి. తెలంగాణ ఉద్యమంలో హరీశ్‌రావు పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. పార్టీ సామాన్య కార్యకర్తగా.. వాగ్దాటి ఉన్న నేతగా.. ఆయన కీలకంగా వ్యవహరించారు.
కమిటీల్లో చోటేదీ?
కేసీఆర్ మేనల్లుడిగా కాకుండా.. తానంటే ఏమిటో అనేకసార్లు హరీశ్ నిలుపుకున్నారు. కానీ.. ఎందుకోగానీ.. ఆయనను గుర్తింపు సమస్య వెంటాడుతోంది. హరీశ్‌పట్ల కేసీఆర్ వివక్ష చూపుతున్నారనే టాక్ రోజురోజుకూ ఎక్కువవుతోంది. మేనల్లుడిని పక్కనబెట్టి.. తనయుడు కేటీఆర్‌కే కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లోని కొంపల్లిలో టీఆర్ఎస్ పార్టీ 17వ ప్లీనరీ జరుగుతోంది. అయితే దీనిని విజయవంతం చేయడానికి సీఎం కేసీఆర్ తొమ్మిది కమిటీలు వేశారు. ఈ కమిటీల్లో మంత్రి హరీశ్‌రావు చోటు దక్కలేదు.
నామమాత్రమేనా?
పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్లీనరీ నిర్వహణలో ఆయన పాత్ర నామమాత్రంగా మారింది. పదిరోజులుగా ఏర్పాట్లు జరిగినా ఆయన ఎక్కడ కూడా కనిపించకపోవడం గమనార్హం. ఇప్పుడు దీనిపై పార్టీ వర్గాల్లో హాట్‌హాట్ చర్చ జరుగుతోంది. ఒకప్పుడు అన్నీ తానై పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన హరీశ్‌కు ఇప్పుడు ఏ కమిటీలోనూ స్థానం కల్పించకపోవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. తీర్మానాల కమిటీ, ఆహ్మాన కమిటీ, సభాప్రాంగణం, వేదిక నిర్వహణ కమిటీ, వలంటరీ కమిటీ, ప్రతినిధుల నమోదు, పార్కింగ్ నిర్వహణ కమిటీ, నగర అలంకరణ కమిటీ, భోజన ఏర్పాట్ల కమిటీ, మీడియా కో ఆర్డినేషన్ కమిటీ.. ఇలా తొమ్మిది కమిటీలు వేశారు సీఎం కేసీఆర్.
తీర్మానాల కమిటీలోనూ....
అయితే ఇందులో తీర్మానాల కమిటీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. దానిలో కూడా మంత్రి హరీశ్‌రావుకు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తీర్మానాల కమిటీలో కే కేశవరావు, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు అవకాశం కల్పించారు. పార్టీలో ఇంతపెద్ద పండుగ జరుగుతుంటో మంత్రి హరీశ్‌రావు ఎక్కడ కనిపించకపోవడం.. దీనిపై ఎవరూ కూడా బహిరంగంగా మాట్లాడడానికి సాహసించకపోవడం గమనార్హం.
క్రమక్రమంగా తగ్గిస్తూ.....
ఇక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో వచ్చే ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణలో పార్టీ పగ్గాలతో పాటు తన వారసుడిగా కేటీఆర్‌ను ప్రకటించేసి ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీశ్‌కు ఇప్పటికే క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందంటున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన ప్లీనరీ ఏర్పాట్ల విషయంలోనూ హరీశ్‌ను పూర్తిగా పక్కన పెట్టేయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.