బిగ్ బ్రేకింగ్ : తూర్పు రాజకీయాల్లో తుఫాన్ ... వారిద్దరూ ఆ పార్టీలోకే ...!!

Update: 2018-10-21 06:30 GMT

తూర్పు గోదావరి రాజకీయాలు బాగా వేడెక్కిపోనున్నాయి. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో మొదలైన జనసేన చేరికలు భవిష్యత్తులో మరింత పెరగనున్నాయి. కోస్తా జిల్లాల్లో ఎస్సి సామాజిక వర్గం లో బలమైన నేత మాజీ ఎంపి హర్ష కుమార్, మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన లో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెండు బలమైన సామాజిక వర్గాల ప్రతినిధులుగా వున్న వీరిద్దరూ జనసేన లో చేరితే గోదావరి జిల్లాల్లో రాజకీయ ముఖ చిత్రంలో పెనుమార్పులు సంభవించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.

కులాలను కలిపే రాజకీయం ...

జనసేన సిద్ధాంతం కులాలను మతాలను కలిపే రాజకీయం, సామాజిక న్యాయం అన్నవి. ఈ రకమైన రాజకీయానికి గత మూడేళ్ళుగా హర్ష కుమార్, ముద్రగడ పద్మనాభం బీజాలు వేశారు. కాపుల పేటలో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించడం ద్వారా సరికొత్త సందేశాలను ఇరువురు అందించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఒకే నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్య దళిత నేతలు, కాపు నేతలతో ఈనెల 24 న కాకినాడలో నిర్వహించే సమావేశం లో ప్రాధమికంగా జనసేనలో చేరే ముహూర్తం ఖరారు చేయనున్నారు. టిడిపి, వైసిపి లు రాష్ట్రంలో వారి సామాజిక వర్గాల అభ్యున్నతికి తప్ప సర్వ సమాజానికి ఉద్దేశించి నడుచుకోవడం లేదన్న వాదనతో జనసేన వైపు వీరిద్దరూ నడుస్తున్నట్లు తెలుస్తుంది.

సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన హర్ష ...

సోషల్ మీడియా ద్వారా తాము ఏ పార్టీలోకి చేరనుంది దాదాపు స్పష్టం చేశారు హర్షకుమార్. తొలుత వైసిపి లో చేరాలని భావించామని అయితే ఆ పార్టీ తెలుగుదేశానికి ఏ మాత్రం తీసిపోవడం లేదని తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ తరువాత తనకు నాలుగుసార్లు టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష ప్రసాదించిన కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయిస్తే తమ రాజకీయ విరోధిగా భావించే తెలుగుదేశంతో సిద్ధాంతాలు పక్కన పెట్టి హస్తం వారితో దోస్తీ కట్టడాన్ని కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా సహించలేకపోయానని హర్షకుమార్ అన్నారు. దాంతో ఆ పార్టీతో సంప్రదింపులు విరమించానని చెప్పారు.

భవిష్యత్ కార్యాచరణపై.......

కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండి సెలబ్రెటీ హోదాను పక్కన పెట్టి ప్రజలకు ఏదో చేయాలనే తపనతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారనిపించిందని, అందుకే ఆ పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు తాను పవన్ కళ్యాణ్ తో చర్చించలేదని తాను ముద్రగడ పద్మనాభం కలిసి ముఖ్యులతో సమావేశం అయ్యి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. తాము నిర్ణయం తీసుకునే సమావేశానికి ముఖ్య అతిధిగా బాబా సాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ ను ఆహ్వానిస్తున్నామని ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తన ఫెస్ బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు హర్ష కుమార్.

Similar News