అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని పదే పదే చెబుతున్న చంద్రబాబు.. అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారా? అదే అవినీతిని వచ్చే ఎన్నికల్లో పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించుకున్నారా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. ముఖ్యంగా విభజనతర్వాత నష్టపోయిన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టబడులు వస్తేనే తప్ప అభివృద్ధి జరగదని భావించిన చంద్రబాబు.. ఆ దిశగా పావులు కదిపారు. విదేశీ సంస్థలను ఆకర్షించేందు కు ఏటా విశాఖలో పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని సంస్థలు కోట్ల రూపాయలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, నాలుగేళ్లుగా ఈ ఒప్పందాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి కానీ.. ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు.
ఒప్పందాలతో సరి.....
మరి దీనికి రీజనేంటి? ఎందుకు ఒప్పందాలు చేసుకుని కూడా పలు సంస్థలు ప్రాజెక్టులు ప్రారంభించడం లేదు? ఇవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు! తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వచ్చిన తొలి, ముఖ్యమైన ప్రాజెక్టు ‘హీరో మోటో కార్ప్’ ద్విచక్ర వాహనాల తయారీ యూనిట్. హీరో సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? ప‌్రపంచంలోనే హీరో నెంబర్ 1. మరి అలాంటి సంస్థ ఏపీలో ప్రాజెక్టు స్థాపిస్తోందంటే.. ప్రభుత్వానికే కాదు, ప్రజలకూ సంతోషమే. ఇక ఏముంది.. తాము సాధించిన ఘనకార్యాల్లో ఇది పెద్దదంటూ భారీ ఎత్తున చంద్రబాబు ప్రకటనలు గుప్పించారు. ఏవేదికక్కినా.. ఎవ్వరెదురైనా.. ఇదే విషయాన్ని గొప్పగా చెప్పుకొన్నారు. ఏళ్లు గడిచాయి. ఈ ప్రకటనలే మిగిలాయి కానీ,.. పరిశ్రమ జాడ కనిపించలేదు.
నాలుగేళ్ల క్రితమే......
నిజానికి హీరో మోటోకార్ప్ లిమిటెడ్ 2014 సెప్టెంబర్ 16న సర్కారుతో అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చు కుంది. ఈ సంస్థకు చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సమీపంలో 600 ఎకరాల భూమి కేటాయించారు.అంతేకాదు, కంపెనీ పెట్టిన కండిషన్లకు ప్రభుత్వం పచ్చజెండా కూడా ఊపింది. ప్రభుత్వమే డెవలప్‌మెంట్ కోసం.. ఈ భూమిపై కోట్లాది రూపాయలు వెచ్చించింది. అయితే ఈ ఏడాది మార్చి 23న ఎట్టకేలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ పై కంపెనీ 1600 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని, దీని ద్వారా సుమారు 12 వేల ఉద్యోగాలు వస్తాయని మళ్లీ రీల్ తిప్పారు. ఆరు వందల ఎకరాల భూమిని కూడా సేల్ డీడ్ కింద కంపెనీకి అప్పగించేశారు.
అందుకే ప్రారంభం కాలేదా?
అయితే శంకుస్థాపన జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకూ హీరో మోటోకార్ప్ యూనిట్ లో పనులు ప్రారంభం కాలేదు. మరి ఏం జరిగింది? హీరో దగ్గర డబ్బులు లేక ప్రాజెక్టు ప్రారంభం కాలేదా? లేక ప్రభుత్వం నుంచి చిక్కులు వచ్చాయా? అని ఆరాతీస్తే.. అవినీతి బాగోతం బట్టబయలైనట్టు టాక్. భూమిని కారుచౌకగా ఇవ్వటంతో పాటు..ఈ సంస్థకు పలు రాయితీలు ఇఛ్చినందున తమ వాటా ఎంతో తేల్చాల్సిందిగా ప్రభుత్వంలోని పెద్దలు పట్టుపట్టినట్లు సమాచారం. ఇది తేలకపోవటంతోనే హీరో మోటో కార్ప్ పనులు ముందుకు సాగటంలేదని తెలిసింది. తమకు నచ్చిన సంస్థలకు భారీ ఎత్తున రాయితీ రేట్లతో భూములు ఇఛ్చి..అడ్డగోలు రాయితీలు ఇఛ్చి వారి దగ్గర నుంచి మళ్ళీ క్విడ్ ప్రోకో కింద ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సో.. దీంతో హీరో గారి కథ ఆసక్తిగా మారింది.