జగన్ కు అదే శ్రీరామరక్ష...?

Update: 2018-04-07 04:30 GMT

ఏపీ రాజకీయాలు హోదా హీట్ లో కొట్టుకుపోతున్నాయి. అధికార తెలుగుదేశం, విపక్షం వైసిపి, జనసేన కమ్యూనిస్ట్ లు ఎవరికీ వారు ఎక్కడా తగ్గడం లేదు. ఏ మాత్రం ఈ దశలో వెనుకబడ్డా ప్రజల్లో నెగిటివ్ మార్కులు పడతాయని ఎవరి రాజకీయాన్ని వారు సీరియస్ గా పండించేస్తున్నారు. ఇక ఈ రేసులో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిలు దాదాపుగా ప్రేక్షక పాత్రగానే మిగిలిపోయాయి. కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, అంతే స్థాయిలో బిజెపి ఉండటంతో మూడు ప్రాంతీయ పార్టీలు దూసుకుపోతూ ప్రజలను తమవైపు ఆలోచించేలా ఉద్యమాలు మొదలు పెట్టాయి. హోదా కోసం ఎవరికీ వారే కృష్ణా తీరాన అన్నట్లు బాబు లోకేష్ సైకిల్ తొక్కేస్తుండగా, జగన్ రొటీన్ గా పాదయాత్ర, ఢిల్లీ లో పార్టీ ఎంపీలతో హల్ చల్ చేయిస్తూ ఫ్యాన్ స్పీడ్ గా తిప్పుతున్నారు. ఇక జనసేనకు ఎర్రసైన్యం తోడైంది. నిర్మాణం లేని పార్టీకి బలమైన పునాదులు, అనుభవం వున్నవారు తోడు కావడంతో తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధం అవుతూ దశల వారి వీధి ఉద్యమాలకు రూపకల్పన చేస్తూ పాదయాత్రలు మొదలు పెట్టింది పవన్ పార్టీ.

బాబు, లోకేష్ సైకిల్ తొక్కక తప్పదా ...?

ప్రత్యేక హోదా సాధన విభజన హామీలకు నాలుగేళ్ళు బిజెపిని ఎదిరించని టిడిపి కి ప్రజల్లో చాలా మైనస్ మార్కులు పడుతున్నాయి. ఇప్పటికైనా మోడీ సర్కార్ నుంచి బయటకు వచ్చి పార్లమెంట్ వేదికగా బాబు సీరియస్ పోరాటం ప్రారంభించడం కొంతమేరకు ఆ పార్టీకి డ్యామేజ్ కంట్రోల్ చేసేలా చేస్తున్నా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లు తిరిగి అధికారంలోకి రావడానికి సైకిల్ ఏ మేరకు స్పీడ్ గా తొక్కుతారో చూడాలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీ తో పొత్తు లేని టిడిపి కి చాలా వరకు గడ్డు పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారంలో ఉండటం, అంగ ,ఆర్ధిక బలగాలతో పాటు పోల్ మేనేజ్ మెంట్ సూపర్ మాస్టర్ బాబు కావడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశాలు గా కనిపిస్తున్నాయి.

పాదయాత్ర ఫలితం ఇస్తుందా ఫ్యాన్ స్పీడ్ పెరుగుతుందా ...?

ఇక ఎన్నికలు వున్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో వుండే వైసిపి అధినేత కు ఈ ఎన్నికలు చావో రేవో. ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే వైసిపి పార్టీ ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితి. దాంతో మండుటెండల్లో జనంలో సుదీర్ఘ పాదయాత్ర చేస్తూ ఫ్యాన్ స్పీడ్ పెంచారు జగన్. అసెంబ్లీని వదిలి రావడం, ఎమ్యెల్యేలను నిలుపుకోలేక పోవడం, అనుభవ లేమి వైసిపి కి మైనస్ లనే చెప్పాలి. ఇక గత నాలుగేళ్లుగా విపక్ష అనుభవం, ప్రజా సమస్యల్లో తలమునకలు కావడం, పటిష్ట ఓటుబ్యాంక్ జగన్ పార్టీకి శ్రీరామ రక్షగా కనిపిస్తున్నాయి. దానికితోడు హోదా కాదు ప్యాకేజ్ అని, అది కాదు మళ్ళీ హోదా అంటూ టిడిపి యు టర్న్ ప్రజల్లో చర్చనీయాంశం కావడం, మోడీ కేసులు పెడతారనే రాష్ట్ర ప్రయోజనాలను బాబు విడిచిపెట్టారనే ప్రచారం జనంలోకి బాగా వెళ్లడం వైసిపికి మైలేజ్ పెంచే పాయింట్స్.

పోరాటం జనసేనను గట్టెక్కిస్తుందా ...?

సరైన వ్యూహం లేదు, నిన్న ఒకటి నేడు ఒకటి రేపు మరొకటి అన్న రీతిలో సాగిపోతుంది అన్న విమర్శలకు తెరదించుతూ జనసేన, కామ్రేడ్ల చేయూత తో రాష్ట్ర హక్కుల కోసం రోడ్డెక్కింది. పార్టీ నిర్మాణం టిడిపి, వైసీపీల స్థాయిలో లేనప్పటికీ ఒక్క పిలుపు ఇస్తే వేలసంఖ్యలో రోడ్లపైకి వచ్చే అభిమాన జనమే జనసేనకు పెట్టుబడి. వారిని సక్రమంగా వినియోగిస్తూ పార్టీ నిర్మాణం చేసుకోవాలని, దీనికోసం కామ్రేడ్లను సన్నిహితంగా అధ్యయనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారం లేకపోయినా దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ లు పార్టీలు మూసుకోలేదు. ప్రజా రాజ్యానికి తగిలిన దెబ్బలేమిటో తెలిసిన పవన్ వచ్చే ఎన్నికల్లో తమ బలాన్ని తేల్చుకోవాలని భావిస్తున్నారు. అధికారంలోకి రావడానికి 25 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉంటానన్న పవన్ కళ్యాణ్ దీర్ఘ ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కపోయినా రాష్ట్రం లో నిర్ణయాత్మక శక్తి కావాలన్న లక్ష్యంతోనే జనసేనాని అడుగులు పడుతున్నాయి. అందుకే ఎవరెన్ని రెచ్చగొట్టినా పార్ట్ టైం నాయకుడన్నా, నాలుగేళ్లనుంచి ఎందుకు చెప్పలేదంటూ టిడిపి చేస్తున్న ఎదురుదాడికి ఆయన ఆవేశంగా బదులు చెప్పడం లేదు. ఆలోచనాత్మకంగా వెళుతూ తాను అడగాలిసిన ప్రశ్నలు, ప్రజలకు చెప్పాలిసిన విషయాలు, భావిపోరాటాలే లక్ష్యంగా జనసేనాని వ్యూహాత్మకంగా పయనం ప్రారంభించారు. ఏపీలోని టిడిపి, వైసిపిలతో సమాన దూరం పాటించే విధానం తోనే పికె రాబోయే ఎన్నికలవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇలా ఈ మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఎవరి ఫీట్లతో వారు ప్రజలను ఆకట్టుకునేందుకు దుమ్ము రేపేస్తున్నారు.

Similar News