ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ? ఉండబోతోంది. వచ్చే ఎన్నికల్లో కామినేని ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఆయన బీజేపీలో ఉంటారా ? లేదా తన రాజకీయప్రస్థానం ప్రారంభమైన టీడీపీలోకి తిరిగి జంప్ చేసేస్తారా అన్నదే ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ది విచిత్రమైన రాజకీయ ప్రయాణం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా ఉన్న ఆయనకు నాడు దివంగత మాజీ ముఖ్య మంత్రి, టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎన్టీఆర్ మృతి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరమైన కామినేని 2009లో ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చి కైకలూరులో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.
అనూహ్యంగా బీజేపీలోకి......
2009 ఎన్నికల్లో కామినేని కేవలం 800 ఓట్ల తేడాతోనే నాటి టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ క్రమంలో ఆయన అనూహ్యంగా బీజేపీలోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి బాబు కేబినెట్‌లో కీలకమైన వైద్యఆరోగ్య శాఖామంత్రిగా నియమితులయ్యారు. కామినేని బీజేపీ ఎంట్రీ వెనుక చంద్రబాబు వ్యూహం కూడా ఉందన్న టాక్ అప్పట్లో వినిపించింది. మూడున్నర ఏళ్ల పాటు ఏపీ కేబినెట్‌లో వైద్య ఆరోగ్యశాఖా మంత్రిగా పని చేసిన కామినేని బీజేపీ మంత్రిగా కంటే టీడీపీ మంత్రిగానే ఉన్నారన్న విమర్శలూ ఉన్నాయి. దీనిపై సాధారణ జనాల్లోను చాలా మందికి ఈ మాట కరెక్టే అన్న అభిప్రాయం ఉంది.
ఎన్డీఏ నుంచి బయటకు రాగానే.....
కొద్ది రోజుల క్రితం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏపీలో టీడీపీ ప్రభుత్వం మధ్య తీవ్రమైన వైరుధ్యం ఏర్పడిన నేపథ్యంలో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రాగా ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే కామినేని సైతం తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం రాజకీయంగా కామినేని మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లిపోతారని వచ్చే ఎన్నికల్లో... ఆయన టీడీపీ నుంచే పోటీ చేస్తారని పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి.
కైకలూరు లేదా....?
దీనిపై ఆయన ఏనాడు పెద్దగా నోరు మెదిపిందీ లేదు. ఇక వచ్చే ఎన్నికల వేడి స్టార్ట్ అవ్వడంతో కామినేని వచ్చే ఎన్నికల బరిలో ఉంటారా ?లేదా రాజకీయంగా సైలెంట్ అవుతారా ? చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న సంబంధం నేపథ్యంలో ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్నది చూడాలి. కామినేని టీడీపీలోకి వస్తే ఆయనకు ఎలాగూ కైకలూరు సీటు లేదా ఎమ్మెల్సీ రెడీగా ఉంటాయని ఆ పార్టీ వాళ్లే చెపుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కామినేని బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అంత సుముఖంగా లేనట్టే తెలుస్తోంది.