మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత, గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ప్రస్తుత బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కు ఆశ ఎక్కువ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. అయితే, ఆయన ఆశించిన పదవి దక్కక పోవడంతో త్వరలోనే బీజేపీకి ఆయన రాం రాం చెప్పనున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆయన అనుచరగణంతో సమావేశమయ్యారని, వారు కూడా ఇక బీజేపీలో ఉండి ఏం ప్రయోజనం అనే అంటున్నారని వార్తలు వస్తున్నా యి. ఇంతకీ, కన్నా ఆశించిన పదవి పైనే ప్రస్తుతం చర్చ సాగుతోంది. నిజానికి ఆయన 2014 మొదటి వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పుట్టిమునుగుతుందని గ్రహించి కమల దళంలోకి జంప్ చేశాడు. బీజేపీ తీర్థం పుచ్చుకుని కేవలం నాలుగేళ్లు మాత్రమే అవుతుంది.
అధ్యక్ష పదవి రాదని తెలయడంతో.....
అయితే, కన్నా మాత్రం ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపైనే కన్నేశారు. కాపు సామాజిక వర్గం ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ వర్గానికి అన్ని పార్టీలూ ప్రాధాన్యం పెంచాయి. ఈ క్రమంలోనే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని కన్నా తెరచాటుగా డిమాండ్ చేశారు. అయితే, అప్పటికే బీజేపీలో సీనియర్లు, సీనియర్ మోస్టులు ఉండడంతో వారిని కాదని కన్నాకు అధ్యక్ష పీఠం ఇవ్వడం తీవ్ర వివాదాస్పదం కావడం ఖాయం. అందుకే బీజేపీ అధిష్టానం ఆయనకు మొండిచేయి చూపింది. కట్ చేస్తే.. ఇప్పుడు త్వరలోనే కన్నా.. బీజేపీకి రాం రాం చెప్పి, వైసీపీలోకి చేరుతున్నారు. అయితే, వైసీపీ నాయకుల ముందు కన్నా.. తన కోరికల చిట్టాను తెరిచారట.
ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్.....
గతంలో కన్నా పెదకూరపాడు నుంచి వరుసగా నాలుగుసార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఓ సారి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆరోసారి వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక బీజేపీకి ఏపీలో ఫ్యూచర్ లేకపోవడం, ఇటు తనకు కూడా ప్రయారిటీ లేకపోవడంతో ఆయన ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే జగన్‌కు తాను పెడుతోన్న కండీషన్లతోనే ఆయన వైసీపీ ఎంట్రీ లేట్ అవుతోందని తెలుస్తోంది.వచ్చే ఎన్నికల్లో తమ ఫ్యామిలీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారని సమాచారం. తనకు గుంటూరు లోక్‌సభ స్థానం, తన రెండో కుమారుడు ఫణికి గుంటూరు పశ్చిమ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది.
రెండు సార్లు జగన్ తో సంప్రదింపులు.....
ఒకవేళ తనకు నరసరావుపేట లోక్‌సభ స్థానం ఇవ్వదలిస్తే పెదకూరపాడు ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని షరతు పెడుతున్నట్లు తెలిసింది. కాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండుసార్లు ఆయనతో మాట్లాడారని.. గుంటూరు పశ్చిమ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని సమాచారం. కానీ, కన్నా మాత్రం.. తనకు తన కుమారుడికి రెండు టికెట్లు కేటాయించాల్సిందేనని పట్టుబడుతన్నట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు మరోసారి కన్నా కేంద్రంగా వివాదం, విమర్శలు వెలుగు చూస్తున్నాయి. మరి కన్నా షరతులకు జగన్ తలొగ్గుతారా? లేదో? వేచిచూడాల్సిందే.