వైసీపీకి ప్లస్ కాకూడదనే కన్నాను...?

Update: 2018-05-02 04:30 GMT

ఏపీలో సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ గ‌త వారం రోజులుగా మీడియాలో బాగా నానుతున్నారు. ఏపీ బీజేపీ ప‌గ్గాల కోసం ఎంతో ఆశ‌తో వెయిట్ చేసిన క‌న్నాకు ఆ ప‌ద‌వి రాద‌ని డిసైడ్ అవ్వడంతో ఆ వెంట‌నే వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అయ్యారు. జ‌గ‌న్‌ను క‌లిసి కండువా క‌ప్పుకునేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇంత‌లో ఏమైందో గాని ఆయ‌న వెళ్లి హైబీపీతో ఆసుపత్రిలో చేరిపోయారు. క‌న్నాను వైసీపీలోకి వెళ్లకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ప్రయ‌త్నాలు చేశారు.... ఇంకా చేస్తున్నారు.

టీడీపీలోకి తీసుకొచ్చేందుకు.....

క‌న్నా లాంటి వ్యక్తి వ‌ల్ల మ‌న‌కు ప్లస్ ఎంత అవుతుంది అన్నదానికంటే వైసీపీకి ప్లస్ కాకూడ‌దు అన్నదే బాబు సిద్ధాంతమ‌ని టీడీపీ వాళ్లు చెపుతున్నారు. అందుకే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు మ‌రో మాజీ మంత్రి క‌న్నాను టీడీపీలోకి తీసుకు వ‌చ్చేందుకు ప్రయ‌త్నాలు ఓ రేంజ్‌లో చేస్తున్నారు. ఈ ఇద్దరికి క‌న్నాతో వ్యాపార భాగ‌స్వామ్యం కూడా ఉంద‌ట‌. ఇంత‌లోనే రామ్‌మాధ‌వ్ నుంచి క‌న్నాకు ఫోన్ రావ‌డంతో క‌న్నా సైలెంట్ అయ్యార‌న్న వార్త కూడా వ‌చ్చింది.

మంచి ఆఫర్లు ఇచ్చినా....

అస‌లు ఏం జ‌రిగిందో కాని క‌న్నా అయితే ప్రస్తుతానికి హాస్పట‌ల్ నుంచి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు. క‌న్నాను టీడీపీలోకి తీసుకువెళ్లేందుకు మ‌ధ్యవ‌ర్తిత్వం న‌డుపుతోన్న టీడీపీ వాళ్లు ఆయ‌న‌కు మంచి ఆఫ‌ర్లు ఇస్తున్నార‌ట‌. అయితే క‌న్నా టీడీపీ ఎంట్రీ ఆ పార్టీలో చాలా లొల్లికి దారి తీయ‌డం అయితే ప‌క్కా. కన్నా టీడీపీలోకి వెళితే ఆయ‌న గ‌తంలో ఐదుసార్లు గెలిచిన పెద‌కూర‌పాడు సీటు ఇస్తే అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్‌ను ప‌క్కన పెట్టాలి. ఆయ‌న ఇప్పటికే అక్కడ రెండుసార్లు గెలిచారు... ఆయ‌న్ను త‌ప్పిస్తే అక్కడ శ్రీథ‌ర్ వ‌ర్గంతో పాటు ఓ బ‌ల‌మైన వ‌ర్గం క‌న్నాకు యాంటీగా ప‌నిచేయ‌డం ప‌క్కా.

సపోర్ట్ చేస్తారా....?

ఇక క‌న్నా 2009లో గెలిచిన గుంటూరు వెస్ట్ సీటు ఆయ‌న‌కు ఇస్తే అక్కడ బ‌లంగా ఉన్న క‌మ్మ వ‌ర్గం ఆయ‌న‌కు స‌పోర్ట్ చేసే ప‌రిస్థితి లేదు. గ‌తంలో క‌న్నా ఇక్కడ గెలిచి మంత్రి అయిన‌ప్పుడు ఈ వ‌ర్గాన్ని నానా ఇబ్బందుల‌కు గురి చేశారు. గుంటూరు వెస్ట్‌లో క‌న్నా కావాల్సినంత యాంటీ వ‌ర్గం పెంచుకున్నాడు. కాంగ్రెస్ వాళ్లలోనే అప్పట్లో ఆయ‌నంటే ప‌డ‌దు. ఇక్కడ ఎంపీ రాయ‌పాటి వ‌ర్గం చాలా ఉంది. వాళ్లు ఇప్పుడు క‌న్నాకు స‌పోర్ట్ చేస్తారా ? అన్నది ప్రశ్నే. ఆ మాట‌కు వ‌స్తే పెద‌కూర‌పాడులోనూ రాయ‌పాటి సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో అక్కడ కూడా ఆయ‌న వ‌ర్గం గెలుపు ఓట‌ముల‌ను డిసైడ్ చేసే పొజిష‌న్‌లో ఉంది.

చీరాల సీటు కూడా.....

ఇక క‌న్నా వైసీపీలోకి వెళితే ఆయ‌న అనుచ‌రుడు తేళ్లు వెంక‌టేష్ యాద‌వ్‌కు చీరాల అసెంబ్లీ సీటు కూడా ఇస్తామ‌న్నట్టు చెప్పారు. ఇప్పుడు అక్కడ చీరాల టీడీపీలో మూడు వ‌ర్గాలు ఉన్నాయి. కాబ‌ట్టి క‌న్నా అనుచ‌రుడికి సీటు క‌ష్టమే. ఇక న‌ర‌సారావుపేట ఎంపీగా వెళ‌దామ‌న్నా అక్కడ క‌న్నాకు కుల‌ప‌రంగా అనుకూల అంశం కాదు. వైసీపీ మ‌రో బ‌ల‌మైన క్యాండెట్‌ను పోటీలో దించితే క‌న్నా త‌ట్టుకునే ప‌రిస్థితి లేదు. ఏదేమైనా క‌న్నా టీడీపీలోకి వెళ్లకుండానే లొల్లి ఇలా ఉంటే మ‌నోడు పార్టీలోకి వెళితే అక్కడ ఫుట్‌బాల్ ఆట ఖాయం.

Similar News