ఏంది కన్నా...? ఎటువైపు?

Update: 2018-05-11 10:30 GMT

మాజీ మంత్రి, గుంటూరు జిల్లా నేత కన్నా లక్ష్మీనారాయణ వచ్చే వారం పార్టీ మారడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ హైదరాబాద్ లో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. కన్నా లక్ష్మీనారాయణకు బీపీ పెరగడంతో వైసీపీలో చేరాల్సిన రోజున ఆస్పత్రి పాలయ్యారు. మూడు రోజుల పాటు గుంటూరులోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన కన్నా తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ వెళ్లారు. తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుంటానని కన్నా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.

హైదరాబాద్ లో ఆరోగ్య పరీక్షలు....

అయితే వైసీపీలో చేరాల్సిన కన్నాలక్ష్మీనారాయణ ఆస్పత్రిలో చేరడంపై అనేక కథనాలు వచ్చాయి. బీజేపీ నేతలు సర్దిచెప్పడంతోనే కన్నా లక్ష్మీనారాయణ వెనక్కు తగ్గారని, కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే బీజేపీ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకోనున్నామని, తొందరపడవద్దని బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ స్వయంగా కోరడంతోనే కన్నా వెనక్కు తగ్గారన్న ప్రచారమూ ఉంది. మరోవైపు కన్నాలక్ష్మీనారాయణ మాత్రం తన సన్నిహితులతో బీజేపీలో ఉండలేనని చెప్పేశారు. ఏపీలో బీజేపీకి కాలం చెల్లిపోయిందని, ఆ పార్టీలో ఉండి సాధించేది ఏమీ లేదన్న నిర్ణయానికి కన్నా వచ్చారు. దీంతో ఇక ఆయన బీజేపీలో కొనసాగరన్నది తేలిపోయందని కన్నా సన్నిహితులు చెబుతున్నారు.

టీడీపీ పరామర్శలు....

మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా కన్నా కోసం తీవ్రంగానే ప్రయత్నాలు ప్రారంభించింది. కన్నాకు రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవిని, మళ్లీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని ఇస్తామని సైకిల్ పార్టీనుంచి గట్టి హామీ లభించింది. అయినా కన్నా మాత్రం తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు పెద్దగా సుముఖంగా లేరని తెలుస్తోంది. చంద్రబాబు పార్టీలోకి వెళితే తనకు భవిష్యత్తు ఉండదని కన్నా గట్టిగా విశ్వసిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం కన్నాను వదలడం లేదు. ఆయనను పరామర్శించే పేరుతో వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు.

వైసీపీలో చేరేందుకే....

ఇక వైసీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక దాదాపు ఖాయమైన తరుణంలో వాయిదా పడింది. కన్నా చేరిక కేవలం వాయిదా మాత్రమేనని, ఆయన ఎప్పుడైనా తమ పార్టీలోకి వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ టిక్కెట్లలో దేన్నైనా ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉండటం, జగన్ పాదయాత్రతో పార్టీకి హైప్ రావడం వంటి కారణాలు కన్నాను ఫ్యాన్ పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ విషయాన్ని కన్నా చూచాయగా సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద వచ్చే వారమే కన్నా రాజకీయ నిర్ణయం తీసుకోనున్నారని ఆయన సన్నిహితుడొకరు తెలిపారు.

Similar News