క‌ర‌ణంపై వేటు ఖాయం..! రీజ‌నేంటంటే..?

Update: 2018-08-18 15:30 GMT

ప్ర‌కాశం జిల్లా టీడీపీలో నిత్య అస‌మ్మ‌తి, అసంతృప్త నాయ‌కుడిగా పేరు పొందిన మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి త‌న దూకుడును ఏ మాత్ర‌మూ త‌గ్గించ‌డం లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నా.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిలో ఏ మాత్ర‌మూ మార్పు రావ‌డం లేదు. తానే సీనియ‌ర్‌న‌ని, అంద‌రూ త‌న‌మాటే వినాల‌ని ఆయ‌న నియంతృత్వ ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పార్టీలో వర్గ విభేదాలు సమసిపోయేలా చేయాలని సీఎం ఎంత ప్రయత్నించినా సెగ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అద్దంకిలో తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా కరణం బలరాం దూకుడుగా వ్యవహరిస్తుండడం అద్దంకి పాలిటిక్స్‌ను హీటెక్కించింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో గ‌త‌ పది రోజులుగా ఎమ్మెల్సీ కరణం బలరాం దూకుడు పెంచారు.

తామే అభ్యర్థిమంటూ.....

అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో సిమెంటు రోడ్లకు వరుస పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అద్దంకి నుంచి రాబోయే ఎన్నికల్లో తామే పోటీలో ఉంటామంటూ కరణం, ఆయన తనయుడు వెంకటేష్‌లు ప్రకటనలు కూడా చేస్తున్నారు. వెంక‌టేష్ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు త‌న‌దే అని స‌వాళ్లు ర‌వ్వుతున్నారు. దీంతో పాటు బలరాం తనదైన శైలిలో ఇక్క‌డి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నుంచి వ‌చ్చిన గొట్టిపాటి ర‌విపై వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాను పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేసి వచ్చానని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పదవికి రాజీనామా చేయకుండా పార్టీలు మారడం సరైన సంస్కృతి కాదని దెప్పిపొడుస్తున్నారు.

పనులకు ప్రారంభోత్సవాలతో......

కరణం, ఆయన తనయుడు వెంకటేష్‌ల దూకుడుతో సంతమాగలూరు, బల్లికురవ, అద్దంకి, జే పంగులూరు మండలాల్లో వారి అనుచరవర్గంలోనే గంద‌ర‌గోళం నెల‌కొంది. నిజానికి క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ల్ల పార్టీ ఇక నిల‌బ‌డ‌ద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు.. ఆయ‌న‌ను దాదాపు ప‌క్క‌న పెట్టి.. ఆయ‌న స్థానాన్ని గొట్టిపాటికి క‌ట్ట‌బెట్టారు. అంతేకాదు, అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ పరిణామంతో బలరాం వర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి వైపు వెళ్లింది. కానీ, ఇప్పుడు ఎన్నిక‌లు వ‌స్తుండ‌డంతో బలరాం కుటుంబం అద్దంకి రాజకీయాల్లో జోక్యం పెంచి ఏకంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బలరాం స్పీడు పెంచినట్లు తెలుస్తోంది.

త్వరలోనే కరణంపై.....

రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేష్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు బలరాం సిద్ధమయ్యారు. తాము అద్దంకి నుంచి బరిలో దిగుతామని ఇప్పటికే వారు క్యాడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే పాత వర్గాన్ని మొత్తం తిరిగి తమవైపు తెచ్చుకునేందుకు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. అయితే, ఇది పార్టీని ఇక్క‌డ బ‌ల‌ప‌ర‌చ‌క‌పోగా.. చేటు తెస్తుంద‌ని ఇప్ప‌టికే అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో త్వ‌ర‌లోనే క‌ర‌ణంపై వేటు ప‌డే ఛాన్స్ కూడా ఉంద‌ని ప్ర‌చారంతో పాటు ఆయ‌న వైసీపీలోకి వెళ‌తార‌న్న టాక్ కూడా వ‌స్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News