మృతి చెందిన వారి గురించి నాలుగు మంచి మాటలే మాట్లాడుకోవాలి. అయితే, ఇప్పుడు మావోయిస్టుల చేతిలో దారుణాతి దారుణంగా మృతి చెందిన కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరీ సోమల వ్యవహారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 2014 వరకు బద్ధ శత్రువులుగా వ్యవహరించిన వీరు ఎవరికి వారుగా రాజకీయాలు చేశారు. తమ సొంత నినాదాలతో గిరిజనులను ఆకర్షించారు. వారి సమస్యలపై స్పందించారు. 2009లో అరకు నియోజకవర్గం నుంచి సివేరి సోమ.. టీడీపీ టికెట్‌పై గెలుపొందారు. అయితే, గెలిచిన కొన్ని నాళ్లకే ఆయన గనుల వ్యాపారం ప్రారంభించారు. అరకు ప్రాంతాల్లోని గిరిజన మన్యంలో ఉన్న బాక్సైట్ గనులను తవ్వించారు. అయితే, దీనిపై గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
అప్పట్లో కిడారు వ్యతిరేకించి.....
దీనికి అప్పట్లో కిడారు సర్వేశ్వరరావు వ్యతిరేకించారు. నిత్యం అరకులోనే ఉండి గిరిజనులను ఆయన కూడగట్టి ఇదే సోమపై ఆయన దండయాత్ర చేశారు. పలుమార్లు కిడారితో చర్చలకు సైతం సోమ ముందుకు వచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్ధమవుతోంది. అలాంటి సమయంలోనే 2014లో వైసీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. అప్పట్లో సోమపై గిరిజనుల్లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత ఓట్ల రూపంలో కిడారును ముంచెత్తింది. సోమపై వ్యతిరేకులు దాదాపు 35 వేల మెజారిటీతో అరకులో కిడారిని గెలిపించి చరిత్ర సృష్టించారు. నిజానికి అరకులో 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సివేరీ సోమ.. కేవలం 405 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో కేవలం కాంగ్రెస్, టీడీపీల మధ్యే ద్విముఖ పోటీనే ఉంది.
అప్పట్లోనే స్వల్ప మెజారిటీ......
అయినా కూడా సోమ కేవలం 405 ఓట్ల మెజారిటీనే తెచ్చుకోవడం గమనార్హం. కానీ అనతి కాలంలోనే సోమ వ్యవహారం గిరిజనులకు కంటిపై కునుకులేకుండా చేసింది. దీంతో ఆయనను ఎప్పుడు ఓడించి పక్కన కూర్చోబెట్టాలా? అని నిర్ణయించుకున్నారు. దీంతో 2014లో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ.. కిడారికి 35 వేల ఓట్ల మెజారిటీ వచ్చి చరిత్ర సృష్టించింది. అయితే, ఎవరైతే.. తమకు అండగా నిలుస్తారని గిరిజనులు భావించారో.. ఆ కిడారే అధికార టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, తాను కూడా గనుల వ్యాపారమే పరమావధిగా ముందుకు సాగడం తీవ్రవివాదానికి దారితీసింది. దీనికితోడు అప్పటి వరకు నానా మాటలు అనుకుని, విమర్శించుకున్న సోమ, కిడారులు చేతులు కలపడం గిరిజనులు సహించలేకపోయారు.
డబ్బుల కోసమే.....
దీనికితోడు మావోయిస్టులు సైతం వీరికి అందివచ్చారు. వారు కూడా కిడారు వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి రావడం వెనుక కనీసం కోట్ల రూపాయల మేరకు నిధులు చేతులు మారాయని, కేవలం డబ్బుల కోసమే కిడారి గిరిజనులను మోసం చేశాడని(పార్టీ మారి) మావోయిస్టుల ప్రధాన ఆరోపణ. అదేసమయంలో ప్రత్యర్థిని మిత్రుడిని చేసుకుని గనుల వ్యాపారాన్ని పెంచుకున్నాడనేది కూడా మరో ప్రధాన ఆరోపణ. వెరసి ఈ ఇద్దరి వ్యవహారానికి తుపాకీతో సమాధానం చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. విచిత్రం ఏంటంటే వైసీపీ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడింది. ఆ పార్టీలో ఉన్నప్పుడు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సైతం వీటిని నిరసిస్తూ ఏకంగా చంద్రబాబు తలే నరుకుతానని తీవ్ర వివాస్పద వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆమె కూడా పసుపు కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.