ఆ పెద్దాయన టీడీపీలోకేనా.... !!

Update: 2018-12-04 05:00 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో తలపండిన నాయకునిగా పేరొందిన పెద్దాయన్ని సైకిల్ ఎక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దాదాపుగా రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితం, మూడు మార్లు ఎంపీగా, ఓ మారు మంత్రిగా పనిచేసి జిల్లా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన కొణతాల రామక్రిష్ణ ఇపుడు రాజకీయ చౌరాస్తాలో ఉన్నారు. ఆయన నాలుగేళ్ళ క్రితం వైసీపీ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మరే పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్యన ఆయన ఉత్తరాంధ్ర సమస్యలపై వేదికను ఏర్పాటు చేసి పోరాడుతున్నారు.

అనకాపల్లి ఎంపీగా...

ఇదిలా ఉండగా అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ నుంచి కొణతాలను పోటీ చేయించాలని పసుపు పార్టీ శిబిరం వ్యూహరచన చేస్తోంది. కొణతాల వంటి ధీటైన నాయకుడు ఉంటే విజయం సులువు అవుతుందని గట్టిగా నమ్ముతోంది. కొణతాల సామజికవర్గం అక్కడ అధికంగా ఉండడం, ఆయనపైన జనంలో మంచి అభిప్రాయం ఉండడంతో సరైన పార్టీ నుంచి దిగితే విజయం గ్యారంటీ అంటున్నారు. అయితే కొణతాల మాత్రం ప్రస్తుతానికి రాజకీయ పార్టీల్లో చేరికపై మౌనంగా ఉంటున్నారు.

కాంగ్రెస్ వాసి.....

కొణతాల మొదటి నుంచి కాంగ్రెస్ వాసిగానే రాజకీయం చేస్తూ వచ్చారు. ఆయనకు విశాఖ జిల్లాలో గాడ్ ఫాదర్ గా దివంగత ద్రోణం రాజు సత్యనారాయణ ఉండేవారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండేవారు. వైఎస్, కొణతాలది పార్లమెంట్ బంధం. అప్పట్లో కొణతాల ఎంపీగా ఉన్న సమయంలో వైఎస్సార్ కూడా కడప ఎంపీగా ఉండేవారు. నాటి నుంచి మంచి స్నేహం కలసి వైఎస్సార్ కోటరీలో కొణతాల కూడా చేరిపోయారు. 2004 ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాగానే కొణతాలను మంత్రిని చేసి తన మిత్ర ధర్మం నెరవేర్చారు. ఆయన 2009లో కూడా వైఎస్ సీఎం అయినా కొణతాల ఇక్కడ నుంచి గెలవకపోవడంతో మంత్రి చాన్స్ తప్పిపోయింది.

వైఎస్ మరణంతో.....

ఇంతలో వైఎస్సార్ మరణించడంతో కొణతాల రాజకీయం కూడా తారుమారైంది. ఆయన తరువాత కాలంలో జగన్ పార్టీలో చేరినా తన ప్రత్యర్ధి, తన సొంత నియోజకవర్గానికి చెందిన దాడి వీరభద్రరావు కూడా వైసీపీలో చేరడంతో తట్టుకోలేకపోయారు. నాటి నుంచి మొదలైన విభేదాలు చివరకు వైఎస్ విజయమ్మ విశాఖ లో ఓటమితో తారస్థాయికి చేరుకున్నాయి. జగన్ ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో కొణతాల బయటకు వచ్చేశారు.

సైకిలెక్కుతారా....

ఇదిలా ఉండగా ప్రస్తుతం అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కొణతాలకు వరసకు వియ్యంకుడు అవుతారు. దాంతో ఆయన సైతం కొణతాలను పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. అయితే కొణతాల మాత్రం ఎటూ తేల్చడంలేదు. మరో వైపు ఆయన అనుచరులు కూడా టీడీపీలో ఇంతకు మునుపే చేరిపోయారు. ఇపుడు కొణతాల రావడం వల్ల ఆయన బలం పార్టీలో పెరుగుతుందని సన్నిహితులు నచ్చచెబుతున్నారు. సిట్టింగ్ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. దాంతో కొణతాలను ఎలాగైనా పార్టీలోకి తెచ్చి అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని జిల్లా టీడీపీ వ్యూహరచన చేస్తోంది.

Similar News