వడివడిగా మారుతున్న రాజకీయ సమీకరణలు ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు జరగనున్నందున అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు రెండూ కూడా అభ్యర్థుల వేట సాగిస్తున్నాయి. సీఎం చంద్రబాబు తన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి వారి వారి జాతకాలను చదివి వినిపిస్తూ. టికెట్ ఇచ్చేదీ లేనిదీ స్పష్టం చేస్తున్నా రు. ఇక, వైసీపీ అధినేత జగన్ వ్యక్తులపై కాకుండా వ్యవస్థ, ప్రజల నాడిని పట్టుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమం లో నే చాలా వరకు నియోజకవర్గాల్లో సెంటిమెంట్ ఎలా ఉంది? ప‌్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎవరిని కోరుకుంటున్నారు? అనే విషయాలను తెలుసుకుని ఆయా నియోజకవర్గాల్లోని సామాజిక సమీకరణలపైనా ఓ అవగాహనకు వస్తున్నారు.
అన్నీ విషయాలను బేరీజు వేసుకుని.....
ఈ క్రమంలోనే సామాజిక వర్గాల బలం, ప్రజల సెంటిమెంట్, సిట్టింగ్‌పై వ్యతిరేకత వంటి విషయాలను బేరీజు వేసుకుని జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంతగా కోరినా వంగవీటి రాధాను కాదని.. గతంలో ఇక్కడ నుంచి గెలిచిన మల్లాదివిష్ణుకు(ఈయన వైఎస్ వీరవిధేయుడు) జగన్ టికెట్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి రాష్ట్రంలో కనీసం రెండు సీట్లు కేటాయించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ భావిస్తున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఎమ్మెల్యే కోన రఘుపతి గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తారు. కాగా ఆ సామాజికవర్గానికి రాష్ట్రంలో మరో స్థానాన్ని కేటాయించాల్సి ఉంది.
బ్రాహ్మణులు అధికంగా......
బ్రాహ్మణులకు రెండు స్థానాలు కేటాయించాలని ఇటీవల విశాఖలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కి బ్రాహ్మణులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజికవర్గం బలంగా ఉంది. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 40 వేల బ్రాహ్మణ వర్గం ఓటర్లు ఉన్నారు. బ్రాహ్మణులకు ఏ పార్టీ అయినా సీటు ఇవ్వాలంటే విజయవాడ సెంట్రల్ సీటే సేఫ్. అందుకే 2009లో ఇక్కడ వైఎస్ విష్ణుకు సీటు ఇవ్వగా ఆయన ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోటీలో రాధాపై విజయం సాధించారు.
సానుభూతి ఉందని......
ఇక్కడ బ్రాహ్మణ వర్గం ఓటర్లు అధికంగా ఉండడంతో ఆ సీటు తమకు కేటాయించాలని బ్రాహ్మణులు వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు విన్నవించారు. దాంతో ఆ నియోజకవర్గం ఆ సామాజికవర్గానికి కేటాయిం చే విషయాన్ని పార్టీ పరిశీలిస్తోందని అంటున్నా కూడా మల్లాది విష్ణుకు దీనిని కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన మల్లాదికి ఇక్కడ మంచి పట్టు ఉండడం గమనార్హం. సత్యనారాయణ పురం, మధురానగర్, దేవీనగర్ తదితర ప్రాంతాల్లో బ్రాహ్మణ వర్గం ఎక్కువగా ఉంది. దీనికితోడు మల్లాదిపై సానుభూతి పవనాలు కూడా బాగానే ఉన్నాయి. దీంతో ఆయన ఇక్కడ నుంచి బరిలోకి దిగితే.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో జగన్ బెజవాడ సెంట్రల్‌కు మల్లాదిని ఖరారు చేసినట్టు ఆఫ్‌ది రికార్డుగా తెలుస్తోంది.