తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు కొందరికి గుణపాఠం నేర్పాయి. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వారు కొందరైతే.... తప్పుడు అంచనాలతో తమ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్న వారు మరికొందరు. తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ పై అంచనాలు లేక కొందరు నేతలు ఆ పార్టీని వీడి వెళ్లగా, మరికొందరు నేతలు కేసీఆర్ పై నమ్మకంతో గులాబీ పార్టీలోకి వచ్చి చేరారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం అదృష్టవంతులెవరో? దురదృష్టవంతులెవరో? తేలిపోయింది.
శీనన్న దారి ఎటు?
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు డి.శ్రీనివాస్. ఎన్నికలకు ముందు ఆయన రాహుల్ గాంధీని కలిశారు. నిజామాబాద్ రూరల్, అర్బర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా లోపాయికారీగా పనిచేశారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వెంటనే కేసీఆర్ ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. తర్వాత అత్యున్నత సభ అయిన రాజ్యసభకు పంపారు. అయితే కేసీఆర్ కూతురు ఎంపీగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో డీఎస్ కిరికిరిలు పెట్టడం ఆయనపై గులాబీ పార్టీ నేతలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆయనను సస్పెండ్ చేయాలని కోరుతూ ఏకంగా కేసీఆర్ కు తీర్మానం చేసి పంపారు. అయితే ఇంతవరకూ డీఎస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.....
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అధికారికంగా కాంగ్రెస్ లో చేరాలని డీఎస్ భావించారు. అప్పుడు తనకు రాజ్యసభ కాని, ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశపడ్డారు. కాని కాంగ్రెస్ రాష్ట్రంలో కుదేలయింది. కేసీఆర్ మళ్లీ వచ్చారు. దీంతో డీఎస్ రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడినట్లే. ఆయన రాజ్యసభకు రాజీనామా చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అలాగే ఇదే జిల్లాకు చెందిన భూపతి రెడ్డి చివరి నిమిషంలో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఆయన నిలుపుకోలేకపోయారు. మరో ఎమ్మెల్సీ రాములునాయక్ దీ అదే పరిస్థితి. మరో ఎమ్మెల్సీ యాదవరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పార్టీ బహిష్కరించింది.
ఎంపీగా విశ్వేశ్వర్ రెడ్డి.....?
ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీగా ఉన్నారు. టీఆర్ఎస్ లో తనకు గౌరవం దక్కలేదంటూ పోలింగ్ కు వారం రోజుల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి కొండా కాంగ్రెస్ కు రాష్ట్రంలో బలమైన గాలులు వీస్తున్నాయని అంచనా వేశారు. ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ సమక్షంలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చివరకు ఫలితాలు చూసిన తర్వాత ఆయన డీలా పడ్డారు. ఇదే ఊపు మీద వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ మారి తప్పు చేశారా? అని ఆయన అనుచరుల్లోనే అంతర్మధనం మొదలయింది. మరోవైపు దానం నాగేందర్, బొల్లం మల్లయ్యయాదవ్ లు పార్టీలు మారి టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యలయ్యారు. విధి...విచిత్రం అంటే ఇదే మరి....!!