కోవూరు టీడీపీలో విభేదాలే ఈసారి వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి విజయాన్ని చేకూరుస్తుందా? నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కోవూరు నియోకవర్గం నుంచి గెలుపొందాలని శ్రమిస్తున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పెద్దగా ఎవరితో కలవరు. ఆయన పని ఆయన చేసుకుని పోతుంటారు. నియోజకవర్గానికే పరిమితమవుతారు. తొలుత ప్రసన్నకుమార్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష్య బాధ్యతలను వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. అయితే నేతల మధ్య సమన్వయం చేసుకోలేకపోవడం, జిల్లా వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయలేనని భావించిన ప్రసన్న కుమార్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని కోవూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారు.
కంచుకోట అయినా......
ఆ తర్వాత ప్రసన్నకుమార్ రెడ్డి స్థానంలో సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిని జగన్ నియమించారు. కోవూరు నియోజకవర్గాన్నితీసుకుంటే నల్లపురెడ్డి కుటుంబానికి కంచుకోట వంటిది. ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబంలోని వ్యక్తులనే కోవూరు ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి 1983 నుంచి వరుసగా 1985,1989 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్ తో విభేదించి 1989లో నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి 1994, 1999 ఎన్నికల్లో కోవూరు నుంచి గెలుపొందారు. 2004లో మాత్రం అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
జగన్ పాదయాత్ర తర్వాత.......
అయితే 2009లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. గత ఎన్నికల్లో మళ్లీ తన చిరకాల ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దాదాపు ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయిన ప్రసన్న కుమార్ రెడ్డి కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. అయితే జగన్ సూచన మేరకు గత మూడున్నరేళ్లుగా ఆయన కోవూరు నియోజకవర్గంలో పట్టును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో పూర్తయిన తర్వాత ప్రసన్నకుమార్ రెడ్డి పూర్తి సమయాన్ని నియోజకవర్గానికే కేటాయించారు. గడపగడపకూ వైసీపీ కార్యక్రమంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
సైకిల్ పార్టీలో సెగ.....
ఈసారి తన విజయం ఖాయమన్న ధీమాలో ప్రసన్న ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో విభేదాలు కలసి వస్తాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మొత్తం పది స్థానాలకు గాను వైసీపీ ఏడింటిని గెలుచుకోగా, టీడీపీ మూడింటికే పరిమితమయింది. ఈ మూడింటిలో ఉదయగిరి, వెంకటగిరితో పాటు కోవూరు కూడా ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి విజయం సాధించారు. అప్పటి నుంచి దశాబ్దకాలంగా ఉన్న పార్టీ క్యాడర్ ను పట్టించుకోకుండా కాంగ్రెస్ వాళ్లకే పెద్దపీట వేస్తున్నారని స్థానిక టీడీపీ నాయకత్వం ఆరోపిస్తోంది. మరోసారి పోలంరెడ్డి కి టిక్కెట్ ఇస్తే తాము మద్దతిచ్చేది లేదని పార్టీ క్యాడర్ తెగేసి చెబుతోంది. అంతటితో ఆగకుండా ఏకంగా నేతలందరూ కలసి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు కూడా. దీంతో పోలంరెడ్డికి, మరో టీడీపీ నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డికి గ్యాప్ పెరిగింది. ఈ విభేదాలు ప్రసన్న గెలుపుకు దోహదం చేస్తాయన్నది విశ్లేషకుల అంచనా.