‘‘ఉత్తరం’’ తిరిగి దండం పెట్టాల్సిందేనా?

Update: 2018-08-04 08:00 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రు ఎలా మార‌తారో.. ఎవ‌రు ఎలాంటి కోరిక కోర‌తారో కూడా చెప్ప‌డం క‌ష్ట‌మే. ఇది అటు తిరిగి ఇటు తిరిగి పార్టీల అధినేతల మెడ‌కు చుట్టుకోవ‌డం ఖాయం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎదుర్కొంటున్నారు. విశాఖ ప‌ట్నం జిల్లాలోని ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న‌కు పెద్ద గుదిబండ‌గా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఎవ‌రికి టికెట్ కేటాయించాలి? అనే అంశం ఆయ‌న‌కు పెద్ద పజిల్‌గా మారింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ నుంచి భారీ ఎత్తున పోటీ ఉండ‌డమే దీనికి ప్ర‌ధాన కార‌ణం. ఇలా పోటీ ప‌డుతున్న వారిలో గెలుపు గుర్రాలు ఉండ‌డం మ‌రింత ఇబ్బందిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ఉత్తరం టికెట్‌ను పొత్తులో భాగంగా చంద్ర‌బాబు బీజేపీకి కేటాయించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీనే....

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్ త‌మ‌కే సొంతం. ఎందుకంటే.. ఎవ‌రితోనూ పొత్తు లేకుండానే చంద్ర‌బాబు ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో విశాఖ ఉత్త‌రానికి ఎమ్మెల్యే అభ్య‌ర్థి అవ‌స‌రం ఉంది. అయితే, ఈ టికెట్‌ను ఆశిస్తున్న వారి సంఖ్య ఇద్ద‌రు నుంచి న‌లుగురుకి చేరింది. అన‌కాప‌ల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు, ఎల‌మంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబులు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక్క‌డ నుంచి గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఇప్ప‌టికే అధిష్టానం వ‌ద్ద స‌మాచారం కూడా చేర‌వేశార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లోనే తాను ఉత్తరం సీటు అడిగానని, తప్పనిసరి స్థితిలో ఎలమంచిలి వెళ్లమంటే వెళ్లాన‌ని, ఈసారి మాత్రం తనకు తాను నివాసం ఉంటున్న ఉత్తర నియోజకవర్గం నుంచే బరిలో దిగే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను పంచ‌క‌ర్ల కోరుతున్న‌ట్టు స‌మాచారం. పైగా త‌న ఇల్లు ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండ‌డంతో తాను ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని చెపుతున్నారు.

మంత్రి పదవి కోసం....

అదేవిధంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా విశాఖ ఉత్తరం నుంచే పోటీ చేస్తానని పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈయన పక్కా ప్రణాళికను రూపొందించుకున్నారు. ఒకసారి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయంగా ఎటువంటి ఆరోపణలు లేవు. దాంతో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి స్వాతి కృష్ణారెడ్డి ఇక్కడి నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయ గురువు ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి సలహా మేరకు జీవీఎంసీ ఎన్నికల్లో మేయరుగా పోటీ చేయాలనుకున్నారు. ఆ ఎన్నికలు ఇప్పట్లో జరగవని అర్థమయ్యాక.. ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

పోటీ తీవ్రం కావడంతో....

మ‌రోప‌క్క‌, మాజీ ఎంపీ, మాజీ మేయర్‌ సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని, ఆయన వస్తే కోరుకున్న సీటు ఇవ్వడానికి పార్టీ పెద్దలు ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన అన‌కాప‌ల్లి పార్లమెంటు సభ్యునిగా, విశాఖ మేయరుగా చేశారు. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆయన కూడా విశాఖ ఉత్తరం నుంచే పోటీకి దిగాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇలా ఏ నియోజకవర్గంలోను లేనంత పోటీ ఒక్క ఉత్తరానికే వచ్చింది. దీంతో ఈ ప‌రిణామం టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఇర‌కాటంలోకి నెట్టేదేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి బాబు త‌న రాజ‌కీయ వ్యూహ చ‌రుత‌తో ఈ స‌మ‌స్య నుంచి ఎలా గ‌ట్టెక్కుతారో చూడాలి.

Similar News