ప్రజలు తమకు అప్పగించిన అధికారాన్ని ఎలాగైనా వాడుకోవచ్చని భావిస్తున్నారు టీడీపీ నాయకులు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఆయన తనయుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ రాకముందు.. వచ్చిన తర్వాత అంటూ.. రెండు విభాగాలుగా చేసుకుని రాజకీయాలను విశ్లేషిస్తున్నారు రాజకీయ పండితులు. నారా లోకేష్ ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పలు ఐటీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అవి ఏర్పాటు చేయకుండానే భారీ ఎత్తున రాయితీలు ప్రకటిస్తోంది. ప్రజల భూములను ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఉదారంగా పంచి పెడుతోంది. అయితే, దీని వెనుక ప్రభుత్వంలోకి రాకముందు నుంచి కూడా నారా లోకేష్ చక్రం తిప్పుతున్నాడని అంటున్నారు పరిశీలకులు.
అంతా లోకేష్ దే......
వాస్తవానికి వైఎస్ సీఎంగా ఉన్నసమయంలో తన కుమారుడు జగన్‌ను దొడ్డిదారిన ఏ ఎమ్మెల్సీగానో చేసుకుని మంత్రిని చేసుకునే అవకాశం ఉండి కూడా ఆయన మౌనం వహించారు. తనకు చెడ్డపేరు వస్తుందని భావించారు. కానీ, చంద్రబాబు మాత్రం తొలి రెండేళ్లు ఆగి.. తన కుమారుడిని రంగంలోకి దింపారు. ఇక, దీనికి ముందు నుంచే లోకేష్ ప్రభుత్వంలో చక్రం తిప్పారనే వ్యాఖ్యలు ఇప్పుడు ఆధారాలతో సహా బహిర్గతం అవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపీఎన్ఆర్ టీ) ఏర్పాటైంది. అయితే, దీనిలో ప్రభుత్వ జోక్యం నేరుగా లేదనేది తెరమీది మాట. కానీ, దీనికి కర్తకర్మ అంతా కూడా నారా లోకేష్ అనేది అందరూ అంగీకరించే విషయం. ఇక, ఈ సంఘానికి అధ్యక్షుడు వేమూరి రవి. అయితే, ఈయన పదవిలోకి రావడానికి లోకేష్ కారణమనేది కూడా బహిరంగ రహస్యమే.
మంత్రిగా బాధ్యతలు కూడా.....
నిజానికి ఈ సొసైటీ ఏర్పాటు సమయానికి లోకేష్ ఇంకా మంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించలేదు. లోకేష్ సిఫారసు తో పదవి దక్కించుకోవటం ఒకెత్తు అయితే… ఇప్పుడు వేమూరి రవి సిఫారసుతో పలు ఐటి కంపెనీలకు కోట్ల రూపాయ ల రాయితీలు కల్పించటం సంచలనంగా మారిపోయింది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే నారా లోకేష్ ఐటి శాఖను తమ ఫ్యామిలీ ఎఫైర్ గా మార్చేసినట్లు ఉందని ఆ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలకు సంబంధించి ఏపీఎన్ ఆర్‌టీ సిఫార్సు చేస్తోంది. ఈ సంస్థ చేస్తున్న సిఫారసుల మేరకే ఆయా సంస్థలకు భూములను కేటాయిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అంటే.. మొత్తానికి ఇక్కడ ఏదో గూడు పుఠాణీ జరుగుతోందన్నది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.
ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం.....
లోకేష్ సిఫారసులతో ప్రెసిడెంట్ అయిన వ్యక్తి.. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అంటే.. లోకేష్‌కు ఫేవర్ చేయకుండా ఉంటారా ? అనేది అసలు విషయం. ఐటి శాఖ నుంచి ఎపీఎన్ ఆర్ టి సిఫారసుతో లక్షలాది రూపాయలు పొందిన సంస్థల్లో కొన్ని ఓ 50 వేల రూపాయలు ఖర్చు పెట్టి..ఓ వైబ్ సైట్ కూడా పెట్టుకోలేదంటే అవి ఎంత సీరియస్ కంపెనీలో ఊహించుకోవచ్చు. నిజంగా అవి ఐటి కంపెనీలే అయితే సొంత ఉద్యోగులే ఒక్క రోజులో వెబ్ సైట్ తయారు చేస్తారు. కానీ అదేమీ లేదు. కానీ పెట్టుబడి రాయితీ పేరుతో మాత్రం ప్రజల డబ్బును మాత్రం పంచేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన గణ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ డెవలప్ మెంట్ సొసైటీ పెట్టుబడి రాయితీ కింద ఏపీఎన్ ఆర్ టీ సిఫారసుతో 19,50,705 రూపాయలు చెల్లించారు.
ఓ టవర్ కట్టి మరీ.....
మంగళగిరిలో ఎస్ డిఎన్ టెలికం ప్రైవేట్ లిమిటెడ్ కు పెట్టుబడి రాయితీ కింద 33,99,573 రూపాయలు చెల్లించారు. ఇదీ ఎన్ఆర్ టీ సిఫారసుతోనే. జెడ్ యాక్సిస్ ఐటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 10,40,575 రూపాయలు, కెల్లీ టెక్నాలజీస్ కు 11,57,480 రూపాయలు చెల్లించారు. ఇవన్నీ మంగళగిరిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్ల రికార్డులు చెబుతున్నాయి. పెట్టుబడి రాయితీ చెల్లించినవి మొత్తం ఏడు కంపెనీలు ఉంటే..అందులో నాలుగు ఎపీఎన్ ఆర్ టి సిఫారసు చేసినవి కావటం విశేషం. అంతే కాదు..ఎపీఎన్ఆర్ టి సిఫారసు చేసిన వారి కోసం రాజధాని పేరుతో తీసుకున్న భూముల్లో ఓ టవర్ కట్టి మరీ..ఐటి స్పేస్ కేటాయించబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో లోకేష్ పాత్ర ఉందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. ఇది ఐటీ పేరుతో ఏపీ ప్రజలకు లోకేష్ పెడుతున్న కుచ్చుటోపీ అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తుండడం గమనార్హం.