ఆయన్ను రంగంలోకి దించితే...???

Update: 2018-11-21 03:30 GMT

చంద్రబాబు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ఏమాత్రం మొహమాట పడటం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే.. పనితీరు బాగాలేకపోయినా.... ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసినా ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వివిధ సమావేశాల్లో వార్నింగ్ లకు కూడా ఎమ్మెల్యేలకు ఇస్తూ వస్తున్నారు. ఒకవైపు వార్నింగ్ లు ఇస్తూనే చంద్రబాబు తన పని తాను చేసుకుపోతున్నట్లు కన్పిస్తోంది. మిషన్ 2019 ఇప్పటి నుంచే చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రత్యర్థుల బలాబలాలను అంచనాలు వేసుకుంటూ తన అభ్యర్థి ఎవరనేది ముందుగానే నిర్ణయిస్తున్నారు. బయటకు పేర్లు చెప్పకపోయినా తాను సీట్లిచ్చే వారికి సంకేతాలు పంపుతున్నారు.

ముందుగానే కసరత్తు.....

చంద్రబాబు గతంలో ఎన్నడూ ఈ విధంగా చేయలేదు. ఎన్నికల ముందు మాత్రమే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసేవారు. కానీ ఈసారి చాలా ముందుగానే చంద్రబాబు ఈ కసరత్తును ప్రారంభించారు. అందులోనూ రాజధాని పరిసర ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఏ ఒక్క సీటు కూడా ఆయన అభ్యర్థి వల్ల కోల్పోయేందుకు ఇష్టపడటం లేదు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంపై చంద్రబాబు కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

సిట్టింగ్ ను మార్చేసి....

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలన్న నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హ్యాట్రిక్ విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. మరోసారి సీటు తనకే వస్తుందన్న నమ్మకంతో శ్రీధర్ ఉన్నారు. రాజధానికి అతి దగ్గరగా ఉండే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా బాగానే జరిగింది. రాజధాని రావడంతో భూముల రేట్లు పెరిగి అన్నదాతల్లోనూ ఆనందం నెలకొంది. 1989 నుంచి జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు విజయం సాధించగా, టీడీపీ రెండు సార్లు గెలుపొందింది.

భాష్యం సంస్థల అధినేతను....

అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ అభివృద్ధి విషయంలో దూసుకుపోతున్నా ఆయనపై అనేక ఆరోపణలు విన్పిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ ఎమ్మెల్యే అవినీతిపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ అనుచరుల ఇసుక దందా, సదావర్తి భూముల కుంభకోణంలో వచ్చిన ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు సంతృప్తిగా లేరని చంద్రబాబు సర్వేలో తేలింది. దీంతో పాటు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. అందుకే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలన్న నిర్ణయానికి పార్టీ అధినేత వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో భాష్యం సంస్థల అధినేత రామకృష్ణను బరిలోకి దించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. భాష్యం రామకృష్ణకు విద్యాసంస్థల అధినేతగా మంచి పేరు ఉండటంతో ఆయనకు టిక్కెట్ ఇస్తే గెలుపు గ్యారంటీ అని చంద్రబాబు ఈసీటుకు టిక్ పెట్టేశారన్నది టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News