జగన్ సుడి బాగున్నట్లుంది. ఆయన చేస్తున్న పాదయాత్ర చూశో....లేక పార్టీకి పెరుగుతున్న ఇమేజ్... చంద్రబాబు ప్రభుత్వ పాలనపై పెరుగుతున్న అసంతృప్తి కారణాలేవైనా కావచ్చు. వైసీపీలో మాత్రం చేరికల జోరు ఊపందుకుంది. కొద్దిసేపటి క్రితమే కృష్ణా జిల్లాలో వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కండువా కప్పేసుకున్న తరుణంలోనే ఆ పార్టీకి మరో శుభవార్త అందింది. మాజీ ముఖ్యమంత్రి తనయుడు నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి తనయుడు నేదురుమిల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
బలంగా ఉన్న జిల్లాలో....
నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. ఇటీవలే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో ఆ పార్టీ నెల్లూరు జిల్లాలో బలం పుంజుకుంది. ఆనం సోదరులు వైసీపీలోకి వస్తారన్న ప్రచారం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇదే సమయంలో వెంకటగిరి నియోజకవర్గంలో పట్టున్న నేదురుమిల్లి కుటుంబం నుంచి రాంకుమార్ రెడ్డి పార్టీలోకి రావడం పార్టీలో మరింత జోష్ పెరుగుతుంది. ఈరోజు నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి నాల్గవ వర్థంతి సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఆగస్టులో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
నాలుగేళ్ల నుంచి.....
నేదురుమిల్లి కుటుంబం నాలుగేళ్ల నుంచి నిశ్శబ్దంగానే ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత వ్యాపార కార్యక్రమాలకే ఆ కుటుంబం ఎక్కువ సమయం కేటాయిస్తుంది. అయితే నేదురుమిల్లి రాజ్యలక్ష్మి గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచే ఆమె ప్రాతినిథ్యం వహించారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లాను శాసించిన నేదురుమిల్లి కుటుంబం కాలక్రమేణా తన పట్టును కోల్పోయింది. 1999, 2004 ఎన్నికల్లో నేదురుమిల్లి రాజ్యలక్ష్మి వరుసగా ఇక్కడి నుంచే విజయం సాధించారు. గత ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయబావుటా ఎగురవేసింది. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ విజయం సాధించారు.
తిరిగి తమ కోటలో....
అయితే ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న వెంకటగిరిలో తిరిగి చక్రం తిప్పేందుకు నేదురుమిల్లి కుటుంబం సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఓటమి పాలయ్యారు. నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి పార్టీలోకి వస్తే ఆయనకే టిక్కెట్ గ్యారంటీ అని వైసీపీ ఇది వరకే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రామ్ కుమార్ రెడ్డి ఆగస్టులో వైసీపీలోచేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే సమయంలో వైసీపీలోకి చేరికలు పెరగడంతో ఆ పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ కుమార్ రెడ్డి చేరిక డేట్ ఫిక్స్ కాకున్నా..చేరడం మాత్రం ఖాయమై పోయింది.