ఓటుకు నోటు కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంశం. మూలన పెట్టిన ఈ కేసును తిరిగి గులాబీ బాస్ ఎందుకు కెలికారు అన్నదే అంతా బుర్రలు బద్దలు కొట్టుకునేలా చేసింది. రెండున్నరేళ్లు గమ్మున్నుండి చడీ చప్పుడు చేయకుండా కేసీఆర్ ఓటుకు నోటు బయటకు తీయడం పై ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. ఇప్పడు చంద్రబాబు పై ఎలాంటి కేసులు వచ్చి పడినా అంతా మోడీ దయే అన్న ప్రచారం సాగే నేపథ్యంలో ఈ కేసు రీ ఓపెన్ ఒక సంచలనంగా మారింది. దాంతో రాజకీయ విశ్లేషకులు, మేధావులు, నేతలు ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు.
బాబుకి ముందరి కాళ్ళకు బంధానికేనా ...?
చంద్రబాబు తెలంగాణాలో నెమ్మది నెమ్మదిగా ఇటీవల పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన ముఖ్యులందరిని కాంగ్రెస్ లోకి వెళ్లేలా తెరవెనుక స్కెచ్ గీసింది చంద్రబాబే నని కేసీఆర్ అనుమానిస్తున్నారు. తనదైన రోజు కోసం చంద్రబాబు ఎంతకాలమైనా సైలెంట్ గా ఎదురు చూస్తారని గులాబీ బాస్ కి బాగా తెలుసు. అలా ఏళ్ళ తరబడి వేచి చూసి సొంత మామకే టెండర్ పెట్టేసిన చంద్రబాబు ను తక్కువ అంచనా వేయొద్దని టి నేతలకు అప్పుడప్పుడు కేసీఆర్ క్లాస్ తీసుకుంటారు. సో బాబు నెట్ వర్క్ ముఖ్యంగా మీడియా బలం అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతం అయివుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఏడాది ఏ పొరపాటు తెలంగాణ సర్కార్ చేసినా జనంలో అల్లరి చేసి రాత్రికి రాత్రి మైలేజ్ కొట్టేసే సత్తా చంద్రబాబు సొంత మీడియా తెచ్చి పెడుతుందన్నది కేసీఆర్ అంచనా. సో ఈ లెక్కల్లో బాబును ఎన్నికల ఏడాదిలో జాగ్రత్తగా వుండాలని ముందే హెచ్చరించడానికి కేసీఆర్ చిన్న మైండ్ గేమ్ ప్రారంభించారని టి వర్గాల్లో కొందరు భావిస్తున్నారు.
గవర్నర్ తో భేటీ తరువాత ...
ఇటీవల ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పై చంద్రబాబు అండ్ టీం ఒంటికాలిపై లేచారు. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలనే స్థాయిలో తెలుగుదేశం నోటి ఉద్యమం తీవ్రం చేసింది. సమయానికి బాబు పక్షాన మాట్లాడతారనే అపవాదు ఎదుర్కొనే లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ సైతం గవర్నర్ తీరుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇదంతా కేసీఆర్ గవర్నర్ లెక్కల్లో వున్నాయి. గులాబీ బాస్ గవర్నర్ నడుమ వున్న మంచి స్నేహభావం అందరికి తెలిసిందే. తామిద్దరూ ఓటుకు నోటు కేసులో క్షమా భిక్ష పెడితే ఏపీకి లంగరెత్తేసిన బాబు టీం తనపై జరుపుతున్న దాడికి గవర్నర్ కేసీఆర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారన్న టాక్ కూడా వస్తుంది. దాంతో బాబును చూస్తూ వదిలేస్తే ప్రమాదమని భావించే ఓటుకు నోటు కేసు ఫైల్ దుమ్ము ఒకసారి దులిపి లోపల పెట్టాలని కేసీఆర్ తలచినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతా మోడీ పైకి పోయిందే ...
ఇప్పుడు చంద్రబాబు ను ఎవరు టచ్ చేసిన ప్రధాని మోడీ ఇదంతా చేస్తున్నారని టిడిపి యాగీ మొదలు పెట్టే వాతావరణం క్రియేట్ అయ్యి వుంది. కేసీఆర్ తన మైండ్ గేమ్ లో భాగంగా కేసు ఫైల్ దులిపినా ఆ లెక్క మోడీ ఖాతాలో వేసేశారు తమ్ముళ్లు. గతంలో అయితే అధినేత జైలుకు పోతే ఏమిటన్న ఆందోళన టిడిపిని వెంటాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి టిడిపి కి లేదు. ఒక వేళ కక్ష సాధింపుగా కేసీఆర్ కానీ మోడీ కానీ బాబుపై కేసులు బనాయించి జైలుకు పంపినా యువరాజు లోకేష్ పట్టాభిషేకానికి సిద్ధంగా వున్నారు. బాబు జైలుకెళితే సెంటిమెంట్ తో టిడిపి కి ఓట్ల వర్షం కురిసే పరిస్థితి. దాంతో ఇక అన్ని భయాలు పోయాయి తమ్ముళ్లకు. అమితుమీ తేల్చుకుంటే ప్రజల్లో మైలేజ్ పెరగడంతో పాటు గతంలో ఓటు కు నోటుకు భయపడ్డారు అంటూ సాగిన ప్రచారం తిప్పికొట్టొచ్చన్న ఆలోచన తమ్ముళ్లలో మొదలైంది. మరి ఈ కేసులు ఎలాంటి మలుపులను తిప్పుతాయో చూడాలి.