పవన్ పై కోవర్ట్ ఆపరేషన్ ...?

Update: 2018-10-14 04:30 GMT

జనసేనానిపై కోవర్ట్ ఆపరేషన్ తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసి చాలా కాలమే అయ్యిందా..? అవుననే పవన్ అనుమానిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుస గుసలు బయలుదేరాయి. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఒక పార్టీ ఈ ఆపరేషన్ లో ఉన్నట్లు లెక్కస్తున్నారు పవన్. ఆయన అనుమానాలు తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి లో చేరిన పార్టీల పొత్తుతో తేలిందంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జనసమితి ఒక్కటిగా ముందుకు వెళుతున్నాయి. సిపిఎం మాత్రం వీరితో జత కట్టలేదు.

ఆ పార్టీ తనకు చివరిలో దెబ్బకొట్టేస్తుందన్న అంచనా ..?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్ లు జాతీయ నాయకత్వాలు ఇచ్చే సూచనలతో తెలుగుదేశం తో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే రాజకీయ ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. స్థానిక నాయకత్వాలు ఏమి చెప్పినప్పటికీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ ఎన్నికల వ్యూహ కమిటీలే ఎవరితో ఎన్నికలకు వెళ్ళాలి అన్నది తేల్చి చెబుతాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బిజెపిని వదిలేసిన బాబును జాతీయ రాజకీయాల అవసరాల రీత్యా తిరిగి అక్కున చేర్చుకుంటాయన్న అనుమానాలు నిజం అవుతాయన్న లెక్కలోనే జనసేనాని ఇప్పటినుంచి జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జనసేన వ్యూహాలు చాలా వేగంగా టిడిపికి లీక్ అవ్వడం వెనుక కొందరు కమ్యూనిస్ట్ నేతల ప్రమేయం ఉందని కూడా పవన్ అంచనా వేస్తున్నట్లు ప్రచారం మొదలైంది.

కోవర్ట్ లపై కోవర్ట్ లు ....

ప్రజారాజ్యం లో దెబ్బకొట్టిన బ్యాచ్ బాగా గుర్తుపెట్టుకున్న పవన్ కళ్యాణ్ తొలినుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తనతో సన్నిహితంగా ఉండేవారి కదలికలపై కన్నేయమని జనసైన్యంలో తన సన్నిహితులకు బాధ్యతలు సైతం ఆయన అప్పగించారని టాక్ వినవస్తుంది. ఎన్నికల ముందు జనసేనకు దెబ్బ కొట్టడానికి ప్రత్యర్ధులు అనేక రకాల వ్యూహాలను అమలు చేయడంతో బాటు మానసికంగా పార్టీ శ్రేణులను నిర్వీర్యం చేసే పనిలో పడతారని దీనికి ప్రత్యర్థులకు వున్న మీడియా బలం తోడు అయితే ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని పవన్ ముందే రాబోయే ప్రమాదాలు ఊహించి తదనుగుణంగా తన అడుగుల దిశ మార్చేస్తున్నారని జనసేన లో ప్రచారం సాగుతుంది. మరి ఆయన అనుమానాలు అంచనాలు ఎలా ఫలితం ఇస్తాయన్నది రాబోయే ఎన్నికలే తేల్చనున్నాయి.

Similar News