తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు.. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ సర్వేల జోరు హోరెత్తుతోంది. తెలంగాణలోనూ.. ఏపీలోనూ పలు ప్రైవేటు ఏజెన్సీలు సొంతంగా సర్వేలు చేస్తుండగా.. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా అప్పుడే సర్వేల పేరుతో రంగంలోకి దూకాయి. ఇక కొందరు నాయకులు, ఎమ్యెల్యేలు, మంత్రులు ఎవరికి వారు ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేట్ వ్యక్తులతో తమ నియోజకవర్గాల్లో తమ పనితీరు ఎలా ఉంది అనేదానిపై సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇక అధికార పార్టీకి ఇంటలిజెన్స్ సర్వేలు, పోలీస్ శాఖ సర్వేలు సరే సరి.
పీకే సర్వేనే టాప్.......
ఎన్నికల హడావుడి తెలంగాణ కన్నా ఏపీలోనే ఎక్కువ జోరుగా కనబడుతోంది. అధికార టీడీపీకి ప్రభుత్వ సర్వేలతో పాటు ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలు, పోలీసు వర్గాల రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరుతున్నాయి. దీనికి తోడు లగడపాటి రాజగోపాల్ వంటి వారు తమ సర్వేలతో ఎప్పటికప్పుడు టీడీపీని ఎలర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక విపక్ష వైసీపీ విషయానికి వస్తే.. వైసీపీకి అనుబంధంగా చేసే సర్వేల్లో చిన్న చితకా సర్వేలను పక్కన పెడితే ప్రశాంత్ కిశోర్ సర్వే టాప్ లెవల్లో ఉంటుంది. పీకే సర్వేలో కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు బలంగా ఉంటే వాళ్లను సైతం పీకే టీం కలిసి రకరకాల ఆఫర్లు కూడా ఇస్తోంది. ఇద్దరు ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ఈ విషయాన్ని ఓపెన్‌గానే చెప్పేశారు.
వెస్ట్ లో రెండు విడతలుగా.....
ప్రశాంత్ కిశోర్ సర్వే ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రెండు మూడు విడతలుగా సర్వే పూర్తి చేసింది. కొన్ని నియోజకవర్గాల్లో మూడు నాలుగు సార్లు సర్వే కంప్లీట్ అవ్వగా కొన్ని నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిశోర్ టీమ్ రెండుసార్లకు తగ్గకుండా ఈ సర్వే పూర్తి చేసింది. కీలకమైన పశ్చిమ గోధావరి జిల్లాలో పీకే టీం రెండు విడతలుగా చేసిన సర్వేలో జిల్లాలో టీడీపీ ప్రభావం గత ఎన్నికలతో పోలిస్తే.. గణనీయంగా తగ్గినట్టు ఆ సర్వేలో వెల్లడయినట్టు పీకే టీమ్ జగన్ కు రిపోర్ట్ అందించింది. జిల్లా లో గత ఎన్నికల్లో పదిహేను అసెంబ్లీ , రెండు పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఓడిపోయింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి ఎవరెవరిని నిలబెట్టాలి ..? పార్టీ తరపున బలమైన అభ్యర్థులు ఎవరవుతారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ మైనెస్ పాయింట్లు ఏంటి అనే విషయాలను పీకే టీమ్ కూపీ లాగింది.
ఐదు సెగ్మెంట్లలో మాత్రమే....
ప్రశాంత్ కిశోర్ పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిన సర్వేలో జిల్లాలో ఐదు సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ విజయం సాధిస్తుందని, మిగిలిన పది నియోజకవర్గాల్లో పార్టీ గట్టి అభ్యర్థులను నిలబెట్టి... కష్టపడితే సానుకూల ఫలితాలు లభిస్తాయని వెల్లడైనట్టు సమాచారం. ప్రస్తుత వైసీపీ లెక్కల ప్రకారం దెందులూరు , తణుకు, ఉండి, గోపాలపురంలో పక్కగానూ... కొవ్వూరులో ఓ మోస్తరుగాను టీడీపీ సత్తా చూపే ఛాన్స్ ఉన్నట్టు తేలిందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో దెందులూరులోవిప్ చింతమనేని ప్రభాకర్, ఉండిలో కలువపూడి శివ, తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ, గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని... ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ బలహీనంగా ఉందని తేలిందట.
ఇక్కడ సరైన అభ్యర్థి లేకపోవడంతో....
ఇక ఎక్సైజ్ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కొవ్వూరులో టీడీపీకి మొగ్గు కనబడుతున్నా .. వైసీపీకి సరైన అభ్యర్థి లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడినదని... అక్కడ సరైన క్యాండ్యెంట్‌ను నియమించుకుంటే గట్టి పోటీ ఇవ్వొచ్చని ఈ సర్వేలో తేలిందట. పీకే సర్వేలో జిల్లాలో ఆచంట నుంచి మంత్రి పితాని సత్యనారాయణకు ఎదురుగాలి వీస్తోందని, ఇక్కడ ఈ సారి వైసీపీ జెండా రెపరెపలాడుతోందని స్పష్టమైందట. డెల్టాలో మూడు, మెట్టలో మరో రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి విజయావకాశాలు ఉన్నట్టుగా ఈ సర్వే స్పష్టం చేసిందట.