గెలుపు ర‌జ‌నీదా... పుల్లారావుదా... !

Update: 2018-10-05 12:30 GMT

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయ వర్గాల చూపంతా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం మీదే ఉంది. గత నాలుగు ఎన్నికల్లో మూడు విజయాలు, ఒకేఒక్కసారి అది కూడా కేవలం 200 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి.... రెండు దశాబ్దాలకు పైగా చిలకలూరిపేట రాజకీయాల్లో తిరుగులేని విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న పుల్లారావుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదా ? విపక్ష వైసీపీ నుంచి తన ద్వారా పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి... పుల్లారావుకే ఏకు మేకుగా మారిన వైనంలా వైసీపీ నుంచి ఆయనపై పోటీకి దిగుతూ సవాళ్లు రువ్వుతున్న విడదల రజిని ఆయనకు నియోజకవర్గంలో ముచ్చెమటలు పట్టిస్తోందా ? దీనికి తోడు నియోజకవర్గంలో పుల్లారావు భార్య షాడో మంత్రి అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం సైతం మంత్రికి ఎఫెక్ట్‌గా మారనుందా ? నియోజకవర్గంలో రజినీకి అనుకూలంగా మారుతున్న అంశాలు ఏంటి ? పుల్లారావుకు మైన‌స్‌ అయ్యే అంశాలు... అనుకూల అంశాలు ఏంటో చిలకలూరిపేట నుంచి ‘‘తెలుగు పోస్ట్‌’’ గ్రౌండ్ రిపోర్ట్

వివాదాలే హైలెట్ గా......

1999లో తొలిసారి అసెంబ్లీకి పోటీ పడి విజయం సాధించిన పుల్లారావు 2004లో జరిగిన ట్రయాంగిల్‌ ఫైట్‌లో కాంగ్రెస్‌ మద్దతుతో ఇండీపెండెంట్‌గా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌ చేతిలో 200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోరులో దాదాపు 19వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం ఇటు పవన్‌ కళ్యాణ్‌ సపోర్టు, జిల్లాలో బలంగా వీచిన టీడీపీ గాలుల నేపథ్యంలో కూడా 10 వేల ఓట్లతో మాత్ర‌మే విజయం సాధించారు. గత ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ ఆర్థిక పర్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా పుల్లారావుకు గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి. నాలుగు ఏళ్లుగా మంత్రిగా పుల్లారావు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కంటే అనేక వివాదాలతోనే ఆయన హైలెట్‌గా నిలిచారు. ఇటు రాష్ట్ర స్థాయిలో మంత్రిగానూ సరైన పనితీరు లేక చంద్రబాబు దగ్గర మైన‌స్‌ మార్కులు వేయించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగానూ ఘోరంగా ఫేల్‌ అయ్యారు. ఆయన ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గ మార్కెట్‌ కమిటి ఇప్పటికీ భ‌ర్తీ కాలేదు.

రజనీ గ్రాఫ్ పెరుగుతుండటంతో.....

పశ్చిమగోదావరి జిల్లాలో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ జిల్లాకు గతంలో ఇన్‌చార్జ్‌ మంత్రిగా పని చేసిన అయ్యన్న పాత్రుడుతో పోలిస్తే పుల్లారావుకు కనీసం పదిశాతం మార్కులు కూడా వెయ్యలేమని చెబుతున్నారంటే ఆయన పనితీరు ఎలా ఉంటుందో తెలుస్తోంది. ఇక ఇటు గుంటూరు జిల్లాలోనూ మంత్రిగా ఆయన వల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఒరిగిందా అన్న ప్రశ్నకు ఆన్సర్‌ సందేహమే. ఇదిలా ఉంటే చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి మహిళా సమన్వయకర్తగా ఉన్న విడదల రజ‌నీ రెండు నెలల్లోనే రోజురోజుకు గ్రాఫ్‌ పెంచుకుంటూ పుల్లారావుకు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నారై అయిన రజ‌నీ బలమైన వాగ్ధాటితో మంత్రితో పాటు మంత్రి భార్యను సైతం షాడో మంత్రిగా టార్గెట్‌ చేస్తూ... మంత్రి అనుచరుల ఆగడాలను ప్రస్తావిస్తూ పదునైన వాగ్భాణాలు సంధిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు.

హాట్ హాట్ గా మారింది......

ఆర్థికంగా కూడా రజినీ బలమైన వ్యక్తి కావడంతో పాటు నియోజకవర్గంలో చురుకుగా కదులుతుండడంతో ప్రస్తుతం రజ‌నీ జోరు ముందు పుల్లారావు బేజారు అవుతున్నార‌ని కూడా జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. రజ‌నీ ఎంట్రీతో చిలకలూరిపేట నియోజకవర్గం మోత్తం హాట్‌ హాట్‌గా మారింది రజ‌నీకి కొత్తలో నియోజకవర్గ సమన్వయక‌ర్త‌ పగ్గాలు అప్పగించినప్పుడు పుల్లారావు అనుచరులే ఈ సారి మా సార్‌ 20వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు, పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు అని చెప్పారు. రజినీకి ఇన్‌చార్జ్‌ పగ్గాలు ఇచ్చిన నెల రోజులకే ఈ సారి గెలుపు అంత కష్టం కాదు అని అదే పుల్లారావు అనుచరులే చెబుతున్నారంటే రజినీ స్పీడ్‌ ఎలా ఉందో... ఆమె గ్రాఫ్‌ రోజురోజుకు ఎలా పెరుగుతుందో స్పష్టం అవుతుంది.

కులసమీకరణలూ కలసివస్తాయా?

అన్ని విధాల బలంగా ఉన్న రజినీకి కుల సమీకరణలు కూడా కొంత వరకు ప్లస్‌ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇటు పుల్లారావుకు సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేఖత వ్యక్తం అవుతుండడం దీనికి తోడు ఆయన ఫామిలీపై వస్తున్న ఆరోపణలు సైతం ఆయనకు ప్రతిబంధకంగా మారాయి. గత ఎన్నికల్లోనే ఎన్నో సానుకూలతల మధ్య కేవలం 10 వేల ఓట్లతో విజయం సాధించిన పుల్లారావుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఈజీ కాదని రజినీ దూకుడు చూస్తుంటే ఆయన టీమ్‌లో ఆందోళన చెలరేగుతున్నట్టే కనిపిస్తోంది. రజినీ తనదైన వ్యూహాలతో దూసుకుపోతుండగా వీటన్నిటినీ గమనిస్తున్న పుల్లారావు ఎన్నికలకు ముందు తన స్ట్రాటజీని ఎలా అమలు చేస్తారు... ఆమెను ఎదుర్కునేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నుతారన్నది ఒక్కటి మాత్రమే ప్రస్తుతం వెయిట్‌ చెయ్యాల్సి ఉంది.

కొన్ని మండలాల్లో పట్టు.....

ఇక నియోజకవర్గంలో చిలకలూరిపేట మున్సిపాలిటితో పాటు మూడు మండలాల్లో ప్ర‌స్తుతం ఉన్న బలా బలాలు బట్టి చూస్తే య‌డ్లపాడు మండలంలో వైసీపీకి స్పష్టమైన మొగ్గు కనపడుతోంది. నాదెండ్ల‌ మండలంలో నువ్వా నేనా అన్నట్టుగా రజినీ, పుల్లారావు మధ్య పోటీ ఉన్నా ఇక్కడ టీడీపీకే స్వల్ప ఎడ్జ్‌ ఉంది. ఇది మారిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనూ య‌డ్ల‌పాడు, నాదెండ్ల మండ‌లాల్లో టీడీపీకి చాలా త‌క్కువ మెజార్టీయే వ‌చ్చింది. ఇక చిలకలూరిపేట మండలంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌కు మెజారిటీ వచ్చింది. కమ్మ సామాజికవర్గం ప్రాబ‌ల్యం ఎక్కువగా ఉన్న ఈ మండలంలో ఇప్పటి వరకైతే రజినీకి పట్టు చిక్కలేదు. మర్రి రాజశేఖర్‌కు పట్టున్న ఈ మండలంలో రజినీ ఎంత వరకూ చొచ్చుకుపోతుంది, ఇక్కడ అసంతృప్తి వర్గాన్ని ఆమె తన వైపునకు ఎలా తిప్పుకుంటుంది అన్నదాని మీదే వైసీపీ గెలుపు, ఓటమిలు ఆధారపడి ఉంటాయి.

ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే.....

రజినీ - రాజశేఖర్‌ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు తెరపడితే చిలకలూరిపేట మండలంలో వైసీపీకి కలిసివస్తుంది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇదే రీతిలో కంటిన్యూ అయితే చిలకలూరిపేట రూరల్‌ మండలం రజినీకి మైన‌స్‌గా మారుతుంది. చిలకలూరిపేట మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో పుల్లారావుకు కాస్త అటు ఇటుగా దాదాపుగా 8వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. టౌన్‌లో తమకే మెజారిటీ వస్తుందని ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సామాజికవర్గాల వారీగా ఎవరికి వారు మున్సిపాలిటిలో ఎంత మెజారిటీ వస్తుందన్న లెక్కల్లో మునిగితేలుతున్నారు.

అంచనాలకు మించి......

ఏదేమైనా చిలకలూరిపేటలో వరుస విజయాలతో దూసుకుపోతూ రెండు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న పుల్లారావుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు. ఆయ‌న త‌న హ్యాట్రిక్‌ విజయానికి చెమటోడ్చాల్సిందే అన్నది ఓ వైపు స్పష్టం అవుతుండగా మరో వైపు నెల రోజుల్లోనే తిరిగులేని గ్రాఫ్‌తో దాదాపు పుల్లారావుకు సరిసమానమైన పోటీ ఇచ్చే స్థాయికి వచ్చిన రజినీ అంచనాలకు మించి పెర్‌ఫామ్‌ చేస్తున్నారు. సంచలనానికి అతి సమీపంలో ఉన్న రజినీ మరింతగా కష్టపడాల్సి ఉంది. అలాగే పార్టీలో అసంతృప్తి నేతగా ఉన్న మర్రి రాజశేఖర్‌ను సమన్వయం చేసుకోవడంతో పాటు ఓ ప్రధాన సామాజికవర్గాన్ని సైతం ఆమె కలుపుకోవాల్సి ఉంది. ఏదేమైనా చిలకలూరిపేటలో విజయం వచ్చే ఎన్నికల్లో రజినీ, పుల్లారావు మధ్య దోబూచులాటగా మారింది అనడంలో సందేహం లేదు. మరి ఈ దోబూచులాట ఎవరు ఎవరి ఎత్తులకు చెక్‌ పెట్టి విజయం సాధిస్తారో చూడాల్సి ఉంది.

 

-చిలకలూరిపేట నుంచి ప్రత్యేక ప్రతినిది

Similar News