శిల్పా బ్రదర్స్ కు కలిసొచ్చేట్లు ఉంది. గత ఉప ఎన్నికల్లో ఓటమి పాలయిన శిల్పా మోహన్ రెడ్డికి తాజాగా నంద్యాలలో జరగుతున్న రాజకీయ పరిణామాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు. టీడీపీలో గ్రూపుల గోలతో పాటు తనకు గత ఎన్నికల్లో ఓటమి సానుభూతి కురిపిస్తుందని శిల్పా మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి మారి మరీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. అయితే ఆ మెజారిటీతో శిల్పా కొంతకాలం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వన్ సైడ్ పోలింగ్ జరుగుతుందని శిల్పా సయితం ఊహించలేకపోయారు.
పరిణామాలను సానుకూలంగా.....
ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలను శిల్పా బ్రదర్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. మంత్రి అఖిలప్రియపై భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు చేయడం, సొంత కుంపటి పెట్టుకోవడం తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం ఆళ్లగడ్డలో నిర్వహించిన ఏవీ హెల్ప్ లైన్ కార్యక్రమానికి ఆళ్లగడ్డ నుంచే కాకుండా నంద్యాల నుంచి కూడా భూమా అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. అంతటితో ఆగకుండా ఏవీ సుబ్బారెడ్డి మంత్రి అఖిప్రియపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
వారిద్దరూ ఇక కలిసేది లేదని....
ఇక తన పోరు అఖిలప్రియతోనేనని ఏవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. భూమా కోసం ఎన్ని త్యాగాలు చేసినా ఆయన బతికున్నంత కాలం తాను పదవులకోసం పాకులేడలేదన్నారు. తనకు 14 ఏళ్లుగా నంద్యాలతో అనుబంధం ఉందని, తన ఆస్తులన్నీ ఆళ్లగడ్డలోనే ఉన్నప్పటికీ భూమా కోసం నంద్యాల వెళ్లి అక్కడ బలమైన క్యాడర్ ను రూపొందించానని చెప్పారు. అంటే ఇక ఏవీ సుబ్బారెడ్డి భూమా ఫ్యామిలీతో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ఆయన ఆళ్లగడ్డ సీటును ఆశిస్తున్నారు. నంద్యాలలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డికి కూడా ఆయన సహకరించరు. ఆయన వెన్నంటి వున్న వారు కూడా భూమాకు వ్యతిరేకంగానే పనిచేస్తారు తప్ప సానుకూలత వ్యక్తం చేయరు.
ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతూ....
ఈ పరిణామాలే ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డిలో ధీమాను పెంచాయి. భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది గడుస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, అనుభవ లేమి, ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుకాక పోవడం తమకు కలసి వస్తాయని శిల్పా మోహన్ రెడ్డి విశ్వసిస్తున్నారు. అందుకోసమే గత వారం రోజుల నుంచి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వారిలో నూతనోత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు శిల్పా. అంతేకాకుండా నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మొత్తం మీద టీడీపీలోని లుకలుకలు శిల్పాకు ఛాన్స్ ఇస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.