టీడీపీలో మ‌రో వికెట్ డౌన్‌..!

Update: 2018-04-24 07:30 GMT

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో నేత‌లు త‌మ‌కు అనుకూలంగా ఉన్న పార్టీని ఎంచుకుని గోడ‌లు దూకుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ పార్టీ.. ఈ పార్టీ అనే తేడా క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యానికి మాత్ర‌మే ఆపార్టీ ఈపార్టీ అనే జెండాలు వెలుస్తాయేమోకానీ.. త‌మ‌కు ఏ పార్టీ అనుకూలంగా ఉంటేనే ఆపార్టీనే త‌మ పార్టీ అనేనేత‌లు లెక్కకు మిక్కిలిగా క‌నిపిస్తున్నారు. తాజాగా రాజ‌ధాని జిల్లా కృష్ణాలో టీడీపీ ప‌రిస్థితి ఇలానే త‌యారైంది. ఈ పార్టీలో టికెట్లు ద‌క్క‌వ‌ని భావిస్తున్న నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా సైకిల్ దిగేస్తున్నారు.

బాబుకు చెప్పి కొందరు.....

చంద్ర‌బాబుకు చెప్పికొంద‌రు, చెప్ప‌కుండానే కొంద‌రు పార్టీకి ఝ‌ల‌క్ ఇస్తున్నారు. వారం కింద‌ట విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ విష‌యంలో త‌లెత్తిన వివాదంతో ఆయ‌న బాబుకుచెప్పి మ‌రీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా మైల‌వ‌రం టికెట్ విష‌యంలోనూ ఇదే ప‌రిస్థితి త‌లెత్తింది. ఇక్క‌డ నుంచి త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని సీనియ‌ర్ రాజ‌కీయ నేత వ‌సంత నాగేశ్వ‌ర‌రావు కుమారుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్.. చంద్ర‌బాబునుకోరారు.

టీడీపీకి ఎదురుదెబ్బలే.......

అయితే, ఆయ‌న‌కు కూడా స‌రైన హామీ ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న కూడా టీడీపీ నుంచి త‌ట్టాబుట్టా స‌ర్దుకుని ఫ్యాన్ కిందికి చేరుతున్నారు. ఆయ‌న‌కు వైసీపీ అదినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే మైల‌వ‌రం సీటును క‌న్ఫ‌ర్మ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇలా.. రాజ‌ధాని జిల్లాలో టీడీపీకి ఒక‌టికి మించి ఎక్కువ‌గానే ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఇక‌, తాజాగా ఇదే జిల్లాకు చెందిన మ‌రో రాజ‌కీయ నాయ‌కుడు టీడీపీ అధినేత‌కు అతి ద‌గ్గ‌ర‌గా మెలిగిన విద్యాసంస్త‌ల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు, ఆయ‌న భార్య విజ‌య‌నిర్మ‌ల‌ ఇద్ద‌రూ బాబుకు హ్యాండిచ్చారు. వీరిద్ద‌రి నిర్ణ‌యం జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి.....

ప‌లు పార్టీలు మారిన ముత్తంశెట్టి 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌జారాజ్యం నుంచి ఆయ‌న భార్య విజ‌య‌నిర్మల‌ను నూజివీడు అసెంబ్లీకి పోటీ చేయించారు. భారీగా ఖ‌ర్చు చేసిన ఆమె మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఇక అదే టైంలో ముత్తంశెట్టి సోద‌రుడు అవంతి శ్రీనివాస‌రావువ ప్ర‌జారాజ్యం నుంచి విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఆర్థికంగా కూడా సాయం చేశారు. వ‌స్తున్నా మీకోసం యాత్ర చేసిన స‌మ‌యంలో త‌న విద్యాసంస్థ‌ల‌కు చెందిన బ‌స్సుల‌ను ముత్తంశెట్టి స‌మ‌కూర్చారు. బాబు కోసం ఖ‌రీదైన బ‌స్సును సైతం కొనుగోలు చేసి కానుకగా అందించారు.

రాజకీయ సమీకరణాలతో.....

ఈ క్ర‌మంలోనే 2014లో ముత్తంశెట్టి.. కృష్ణాజిల్లా నూజివీడు, లేదా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక దాని నుంచి తన భార్య విజ‌య నిర్మ‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. అయితే, అప్ప‌ట్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో బాబు వీరి విజ్ఞ‌ప్తిని ప‌క్క‌న పెట్టారు. ఇక‌, ఇప్పుడు మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నందున మ‌రోసారి వీరు బాబును క‌లిసి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాన్నికేటాయించాల‌ని, ఆ టికెట్‌ను విజ‌య‌నిర్మ‌ల‌కు ఇవ్వాల‌ని కృష్ణారావు కోరిన‌ట్టు స‌మాచారం.

ఇప్పుడు కూడా హామీ లభించక.....

అయితే, ఇప్పుడు కూడా బాబు నుంచి స‌రైన హామీ ల‌భించ‌లేదు. అవ‌నిగ‌డ్డ‌లో టీడీపీకి డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక నూజివీడులో బీసీ వ‌ర్గానికి చెందిన ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. దీంతో ముత్తంశెట్టి భార్యా స‌మేతంగా జ‌న‌సేన‌లోకి చేరిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నట్టు స్థానిక మీడియాకు ముత్తంశెట్టి వివ‌రించారు. వాస్త‌వానికి కొద్ది రోజులుగా ముత్తంశెట్టి దంప‌తులు జ‌న‌సేన‌తోనే కలసి తిరుగుతున్నారు. ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ పెట్టిన‌ప్పుడు కూడా వీళ్ల కాలేజ్ నుంచే వ్య‌వ‌హారాలు న‌డిచాయి. ఇక ఇప్పుడు వాళ్లు జ‌న‌సేన‌లోకి జంప్ చేసేశారు. మ‌రి ఈ ప‌రిణామాల‌తో టీడీపీ ఎంత‌మేర‌కు ఓటు బ్యాంకును కోల్పోతుందో చూడాలి.

Similar News