తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో ఏదో మార్పు కనిపిస్తోంది. తాను తీసుకున్న నిర్ణయాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయని వైఖరి కలిగిన ముఖ్యమంత్రి ఇప్పుడు కొంత పట్టువిడుపుల ధోరణిలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత ఆయన నిర్ణయాలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. రెండోసారి విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతకుముందు ప్రజలు తమ డిమాండ్ల సాధనకు ఎంత పోరాటం చేసినా పట్టించుకోని కేసీఆర్... ఇప్పుడు మాత్రం ఆయనకు ఆయనే వాటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి మనసు కరిగింది...
2016 దసరా నుంచి తెలంగాణలో 10 జిల్లాలో 31 జిల్లాలుగా మారిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గద్వాల, జనగామ, ములుగు వంటి జిల్లాల ఏర్పాటుకు పెద్దఎత్తున ఉద్యమమే జరిగింది. అయితే, గద్వాల, జనగామ వంటి జిల్లాల ఏర్పాటుకు అంగీకరించిన కేసీఆర్ 31 జిల్లాలను ఫైనల్ చేశారు. ఎంతపోరాటం చేసినా ములుగు, నారాయణపేట వంటి జిల్లాల ఏర్పాటు కల సాకారం కాలేదు. పలు కొత్త మండలాల విషయంలోనూ ఇదే జరిగింది. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల సాధనకు అక్కడి ప్రజలు పెద్దఎత్తున పోరాటం చేశారు. ప్రభుత్వ పెద్దలను కలిసి వినవించారు. అయినా, వారి కల నెరవేరలేదు. కానీ, ఇప్పుడు మాత్రం కేసీఆర్ గట్టుప్పల్ మండలం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఓడినా మాట నిలబెట్టుకున్నారు...
భూపాలపల్లి జిల్లాలో కలిసిన ములుగు ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని అక్కడి ప్రజలు పెద్దఎత్తున ఉద్యమం చేసినా జిల్లా చేయలేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇది గుర్తించిన కేసీఆర్ ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళ్లి ములుగును జిల్లా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే, ములుగులో టీఆర్ఎస్ ఓడిపోయింది. అయినా, కేసీఆర్ అన్న మాట ప్రకారమే ములుగు జిల్లా ఏర్పాటుచేయాలని, దీంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట ను కూడా కొత్త జిల్లాగా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. దీంతో తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు కానున్నాయి. ఎంత పోరాటం చేసినా కానీ ఫలించని కలను ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఆయనకు ఆయనే చొరవ తీసుకుని ఏర్పాటు చేయడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
ఎన్నికలు తెచ్చిన మార్పు...
ఇక, మండలాల విషయంలోనూ కేసీఆర్ ప్రజల మనోభావాలకు తగ్గట్లుగానే నిర్ణయం తీసుకోనున్నట్లు కనిపిస్తోంది. ములుగు నియోజకవర్గంలోనే మల్లంపల్లిని కొత్త మండలంగా మార్చేందుకు ఆయన నిర్ణయించారు. ఇక మునుగోడులో కాంగ్రెస్ గెలిచినా అక్కడి ప్రజల కోరిక మేరకు ఆయన గట్టుప్పల్ మండల ఏర్పాటుకు నిర్ణయించారు. జనగామ జిల్లాలో గుండాల మండలం కలవడంతో అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా గుండాలను తిరిగి యాదాద్రి జిల్లాలో కలుపుతున్నారు. మొత్తానికి గెలుపోటములతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గతానికి భిన్నంగా మండలాలు, జిల్లాల విషయంలో ప్రజలు ఏది కోరుకుంటే అదే.. అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు ప్రజలు ఎంత ఉద్యమించినా నిర్ణయం మార్చుకోని కేసీఆర్ ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఎన్నికలే అని చెప్పాలి. ఎన్నికలే ఆయనలో మార్పు తెచ్చినట్లు కనిపిస్తోంది.