విశాఖ జిల్లాలో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. పదవుల కోసం పార్టీలు మారుస్తూ నేతలు తమ జాతకాలను మార్చాలనుకుంటున్నారు. అందరి చూపు ఎమ్మెల్యే టికెట్ కోసమే. అందుకే వచ్చే ఎన్నికల్లో టికెట్టు కోసం చేయాల్సిన ఫీట్లు అన్నీ చేస్తున్నారు. విషయానికి వస్తే విశాఖ అర్బన్ జిల్లాకు చెందిన మంత్రి, టీడీపీలో కీలక నేత అయిన గంటా శ్రీనివాసరావు అతి సన్నిహిత బంధువు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని హస్తం నీడన సేద తీరాలని ఆయన అనుకుంటున్నారుట. మంత్రి టీడీపీ అయితే ఆయన గారి దగ్గర చుట్టం కాంగ్రెస్ అన్న మాట.
మంత్రి వెనకాల చక్రం తిప్పారు....
మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టంగా విశాఖ జిల్లా వాసులకు పరిచయం అయిన పరుచూరి భాస్కరరావు నిన్నా మొన్నటి వరకూ మంత్రి దగ్గరే ఉండే వారు. ఆయన నీడలా వెన్నంటి ఉంటూ షాడో మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మంత్రి బదులుగా ఆయనే అన్ని వ్యవహారాలూ చక్కబెట్టేడంతో అప్పట్లో విపక్షాలు సైతం ఆరోపణలు చేశాయి. ఏకంగా మంత్రి తరఫున అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తూ భాస్కర రావు హడావుడి చేశారని విమర్శలు కూడా ఉన్నాయి. గంటా అనకాపల్లి నుంచి గెలిచిన తరువాత ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ లో చేరి మంత్రిగా ఉన్నపుడు ఆయన అనకాపల్లి లో హవా చాటారు.
ఇద్దరి మధ్య దూరం....
ఇక 2014 ఎన్నికల ముందు గంటా టీడీపీ తీర్ధం పుచ్చుకుని మంత్రిగా అయిన తరువాత భీమునిపట్నంలో కూడా భాస్కరరావు తన సత్తా చాటారు భీమిలీ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా భాస్కరరావు పనిచేస్తూ మంత్రి గంటా కంటే పార్టీలో ఎక్కువగా మెలిగారు. మరి ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కానీ గత కొన్నాళ్ళుగా ఇద్దరి మధ్యన దూరం పెరిగింది. దాంతో భాస్కరరావు అనకాపల్లి వచ్చేసి అక్కడ తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన ఏదో ఒక పార్టీలో చేరి ఎమ్మెల్యే కావాలని భావిస్తూ వచ్చారు.
పొత్తుల నేపధ్యం....
ఇదిలా ఉండగా వైసీపీ, జనసేన తరఫున కూడా ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యన మారిన రాజకీయ సమీకరణల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని తేలడంలో కాంగ్రెస్ లో చేరి అనకాపల్లి టికెట్ సాధించాలని భాస్కరరావు వ్యూహ రచన చేశారు. జిల్లాకు రెండు వంతున కాంగ్రెస్ కు టీడీపీ పొత్తులో భాగంగా టికెట్ ఇస్తుందని అంటున్నారు. రూరల్ జిల్లా నుంచి ఈ మధ్యనే మాజీ మంత్రి బాలరాజు జనసేనలో చేరడంతో గట్టి నాయకుడు రూరల్ జిల్లాలో లేకుండా పోయారు. దాంతో అంది వచ్చిన అవకాశాన్ని సొంతం చేసుకునే ముందు చూపుతో భాస్కరరావు కాంగ్రెస్ లో చేరుతున్నారని అంటున్నారు.
రఘువీరా సమక్షంలో....
విశాఖ జిల్లా అనకాపల్లికి డిసెంబర్ 21న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వస్తున్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు భాస్కరరావు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సొంతంగా కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు. గతంలో మంత్రి వెంట ఉంటూ అనకాపల్లి టీడీపీ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహించినందువల్ల ఆ పరిచయాలు, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు, టీడీపీ పొత్తుతో టికెట్ కనుక వస్తే గెలుపు ఖాయం అని భాస్కరరావు అభిమానులు అంచనా వేసుకుంటున్నారు.