కర్నూలు జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. రాజకీయాలకు పట్టుకొమ్మ అయిన ఈ జిల్లాలో గతంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉండేది. ఇప్పుడు ఆ బలం మొత్తం వైసీపీ పక్షానికి చేరింది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు లెక్కకు మిక్కిలిగా గెలుపొందారు. జిల్లాలో రెండు ఎంపీ సీట్లతో పాటు 11 అసెంబ్లీ సీట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. దీనిని గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు తన పట్టును పెంచుకునేందుకు వైసీపీ నాయకులపై ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రయోగించారు. దీంతో ఇద్దరు ఎంపీలు సహా ఎమ్మెల్యేలు కొందరు సైకిల్ ఎక్కేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి? చంద్రబాబు కానీ, ఇటు జగన్ కానీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు? వంటి కీలక అంశాలు తెరమీదికి వచ్చాయి.
బుగ్గనకు తిరుగులేదని.......
ఇక జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అదిరిపోయే త్రిముఖ పోటీ జరగనుంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున డోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి రాజకీయ ఫ్యామీలీ కేఈ ప్రతాప్ రంగంలోకి దూకారు. ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు సాగినా.. ఎన్నికల పోరులో బుగ్గనే విజయం సాధిం చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ పాగా వేయాలని కేఈ ప్రతాప్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత కొన్నాళ్లుగా ఇక్కడ యాక్టివ్‌గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక, బుగ్గనకు ఇక్కడ తిరుగేలేదని పలు సర్వేల్లోనూ తేలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, ఇంతలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఎంట్రీ ఇస్తున్నారు.
త్రిముఖ పోటీ తప్పదా?
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌పై అలిగి తెరచాటుకు వెళ్లిపోయిన సుజాతమ్మ.. కాంగ్రెస్ నేతల పిలుపుతో మళ్లీ అరంగేట్రానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే కార్యకర్తలతో తన బలం నిరూపించుకునేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతు న్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను డోన్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోరుకు సిద్ధమైనట్టు ఆమె ఇప్పటికే మీడియాకు చెప్పారు. గత ఎన్నికల్లో ఆలూరు నుంచి పోటీ చేసి 22 వేల పైచిలుకు ఓట్లతో డిపాజిట్ దక్కించుకున్న ఆమె వచ్చే ఎన్నికల్లో డోన్‌కు మారుతున్నారు. దీంతో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. కాంగ్రెస్ తరఫున ఇక్కడ నుంచి గతంలో గెలిచిన సుజాతమ్మ.. ఇక్కడ మంచి పేరు సంపాయించుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెకుఇప్పటికీ మహిళల్లో ఓటు బ్యాంకు పదిలంగానే ఉండడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో డోన్‌లో త్రిముఖ పోటీ.. పోటా పోటీగా సాగే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.