వల్లభనేని బాలశౌరి! కాంగ్రెస్ హయాంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు వైఎస్ అత్యంత అనుకూల వ్యక్తిగా గుర్తింపు పొందారు. దీంతో ఈయనను వైఎస్‌కు స్నేహితుడిగా కూడా పేర్కొనేవారు. అయితే, వరుస పరాజయాలతో ఆయన ప్రజల్లో పెద్దగా గుర్తింపు సాధించలేక పోయారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన తెరమీదికి వచ్చారు. ఒక్కసారి బాలశౌరి గ్రాఫ్‌ను చూస్తే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆయన 2004లో తెనాలి ఎంపీగా పోటీ చే సి గెలుపొందారు. నాడు వైఎస్ పట్టుబట్టి మరీ బాలశౌరిని తెనాలి నుంచి ఎంపీగా పోటీ చేయించారు. అప్పట్లో తెనాలి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో విస్తరించి ఉండేది. అయితే, తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తెనాలి నియోజకవర్గం రద్దయింది. దీంతో ఆయన తన నియోజకవర్గాన్ని నరసరావు పేటకు మార్చుకున్నారు.
నరసరావుపేటలో పోటీ చేసి......
అప్పటి సీఎం వైఎస్ ఆశీస్సులను పుష్కలంగా సంపాయించుకున్న బాలశౌరి 2009 ఎన్నికల్లో నరసరావు పేట టికెట్ సంపాయించుకున్నారు. వాస్తవంగా చూస్తే 2009లో గుంటూరు సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సీటు ఇవ్వడం వైఎస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. గుంటూరు నుంచి బాలశౌరిని పోటీ చేయించాలని వైఎస్ ప్లాన్ చేశారు. అయితే ఆ ప్లాన్ పారకపోవడంతో చివరకు ఆయన్ను నరసారావుపేటకు పంపగా అక్కడ బాలశౌరి టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ తనయుడు జగన్ పెట్టిన పార్టీ వైసీపీలోకి మారారు.
గుంటూరు ఎంపీగా.....
2014లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేశారు. అయితే, గల్లా జయదేవ్ ఆర్థికంగా బలంగా ఉండడం, మరోపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు పిలుపు నివ్వడంతో బాలశౌరి 5 లక్షల 49 వేల పైచిలుకు ఓట్లు సాధించి కూడా రెండో స్తానానికే పరిమితమయ్యారు. దీంతో అప్పటి నుంచి ఆయన మీడియా కంట పడకుండానే రాజకీయాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలి, నరసారావుపేట, గుంటూరు ఇలా మూడు సీట్ల నుంచి ఎంపీగా పోటీ చేసిన రికార్డు బాలశౌరికే దక్కింది.తాజాగా మళ్లీ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడంతో వల్లభనేని తెరమీదికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నా.. ఇక్కడ నుంచి విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయులు రంగంలో ఉండడంతో బాలశౌరి ఈ దఫా కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ నాయకుడు కొనకళ్ల నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈసారి ఇక్కడి నుంచే.....
ఇక్కడ ఆశించిన మేరకు పెద్దగా జరిగిన అభివృద్ధి ఏమీలేదు. దీంతో ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇక, ఇప్పటికే ఇక్కడ వైసీపీ మచిలీపట్నం పార్లమెంటరీ కన్వీనర్‌గా బాలశౌరి ఉన్న నేపథ్యంలో ఈ టికెట్ నుంచే ఆయన పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. గతంలో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున కొలుసు పార్థసారథి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన 2009లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. మరి జిల్లా మారుతోన్న బాలశౌరి ఈ సారి అయినా పార్లమెంటు గడప తొక్కే క్రమంలో సక్సెస్ అవుతారేమో ? చూడాలి.