విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ నా యకులు తమ తమ రాజకీయాలను బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో కీలక నాయకుడిగా ఉన్న వంగవీటి రాధా కృష్ణ తన దారి తాను చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు కేవలం పుకార్లు అను కున్న జనసేనలోకి రాధా జంప్.. తాజాగా నిజమని తేలింది. ఇక, ముహూర్తం ఒక్కటే లేటని, తెరచాటున అన్నీ జరిగిపో యాయని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాధా రంగా మిత్రమండలి సైతం నిర్ధారించింది. విషయంలోకి వెళ్తే.. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రాధా.. రాజకీయాల్లో నిలదొక్కకోవడం చాలా కష్టంగా మారిపోతోంది.
స్థిరత్వం లేకుండా....
నిజానికి.. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని, ప్రత్యేక కేడర్‌ను రూపొందించుకునే అవసరం లేకుండానే ఆయన తండ్రి, బెజవాడ బెబ్బులిగా పేరు తెచ్చుకున్న వంగవీటి రంగా అనుచరులను, కార్యకర్తలను, ఆయన వేసిన బాటను కాపాడుకుంటే సరిపోయేది. కానీ, రాధా మాత్రం తొలుత కాంగ్రెస్‌లోనే ఉండి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందినా... ఆ గ్రాఫ్‌ను ఉన్నతీకరిం చుకోవడంలో చాలా వరకు విఫలమయ్యారు. దీనికితోడు వయసు ప్రభావంతో కూడిన అనాలోచిత దూకుడు ఆయనను రాజకీయాల్లో స్థిరత్వం లేకుండా చేశాయి. 2009లో కాంగ్రెస్‌లో ఉండి ఉంటే.. మంత్రి పదవి ఖాయమని తనకు తెలిసి కూడా విజయవాడ నగర మునిసిపల్ కమిషనర్‌తో జరిగిన చిన్న పాటి వివాదాన్ని అప్పటి సీఎం వైఎస్ పట్టించుకోలేదనే ఏకైక కారణంగా ఆయన పార్టీ మారిపోయారు.
ప్రజారాజ్యంలో చేరికతో....
సరే! దీనికి చిరంజీవి కాపు సామాజిక వర్గం కూడా కలిసి వచ్చింది!. ఇక, ఆ తర్వాత నుంచి రాధా గ్రాఫ్ పడిపోయింది. 2009, 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాదించలేక పోయారు. ఫలితంగా ఆర్థికంగా, మానసికంగా కూడా తీవ్రంగా నలిగి పోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడున్న వైసీపీ నుంచి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఆశించిన టికెట్ లభించక పోవడంతో రాధా పార్టీలో ఇమడలేకపోతున్నారు. జగన్ ఆయన్ను పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో ఆయన ఇప్పుడు తాజాగా జనసేనలోకి వెళ్లిపో వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కోరుకున్న విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ మాస్ పీపుల్ ఎక్కువగా ఉండడంతో రాధా గెలుపుకు ఛాన్స్ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.
పోస్టర్లతో తేలిపోయింది......
తాజాగా జనసేనాని పవన్‌కు మద్దతుగా వంగవీటి యువసేన పేరుతో ఉన్న బ్యానర్లు.. విజయవాడలో దర్శన మిచ్చాయి. దీంతో ఇక, రాధా.. త్వరలోనే జనసేనాని చెంతకు చేరిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాధా పొలిటికల్ కెరీర్ క్లోజ్ అన్న టాక్ కూడా బెజవాడలో వచ్చేసింది. ఈ ఎన్నికలు ఆయనకు చావో రేవో లాంటివనే చెప్పాలి. చూడాలి మరి ఇప్పటికైనా గెలుస్తాడో లేదో!!