రాధా బాధ ఇంతింత కాదయా....?

Update: 2018-10-24 01:30 GMT

వంగవీటి రాధా ఎటూ తేల్చడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని క్లారిటీ ఇచ్చినా ఆయన ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. దీనికి తోడు ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని ఆశిస్తున్న యలమంచిలి రవి కూడా రాధాకు టిక్కెట్ ఇస్తే ఆయన గెలుపునకు సహకరిస్తాననిచెబుతున్నారు. నెలరోజులకు పైగా జరుగుతన్న రాధా ఎపిసోడ్ కు ఇప్పుడప్పుడే తెరపడేట్లు లేదని పిస్తోంది. వంగవీటి రాధా ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? పార్టీ మారేందుకు ధైర్యం చేయలేకపోతున్నారా? ఇదే బెజవాడలో హాట్ టాపిక్ గామారింది.

నెల రోజులు దాటుతున్నా.....

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జి నుంచి వంగవీటి రాధా ను తప్పించి మల్లాది విష్ణుకు బాధ్యతలను అప్పగించి నెలరోజులు దాటుతోంది. వంగవీటి రాధా సెంట్రల్ నియోజకవర్గంపైనే ఆశలుపెట్టుకున్నారు. కానీ అది మల్లాది విష్ణుకు దాదాపు ఖరారు కావడంతో రాధాకు జగన్ పార్టీ రెండు ఆప్షన్లు ఇచ్చింది.ఇందులో బందరు పార్లమెంటు ఒకటికాగా, రెండోది విజయవాడ తూర్పు నియోజకవర్గం. బందరు పార్లమెంటు స్థానాన్ని బాలశౌరికి ఇవ్వాలని జగన్ రెండు రోజుల క్రితం డిసైడ్ చేయడంతో ఇప్పుడు రాధాకు తూర్పు ఒక్కటే దిక్కయింది. తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయనని రాధా భీష్మించుకుని కూర్చుంటే ఇక ఎక్కడా అవకాశం లభించకపోవచ్చు.

సీనియర్ నేతల చర్చలు.....

అయితే వంగవీటి రాధా మాత్రం తన అనుచరులతో కూడా చర్చించడం మానేశారు. దాదాపు నెల రోజుల నుంచి మౌనంగానే ఉంటున్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా రాధాతో చర్చలు జరిపారు. అయితే రాధా ఈ చర్చల్లోనూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు రాధా పార్టీని వీడకుండా ఉండేందుకు పార్టీ అగ్రనేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారధి వంటి వారు కూడా చర్చలు జరిపారు. రాధాకు జగన్ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే రాధా మాత్రం తనకు సెంట్రల్ నియోజకవర్గం సీటు కావాలనే పట్టుదలగా ఉన్నారు. కానీ సెంట్రల్ సీటు ఇవ్వరని, తూర్పులో పోటీ చేయమని జగన్ రాధాకు వర్తమానం పంపారు.

రవి మద్దతిస్తానని చెప్పినా.....

తాజా పరిణామాలతో తూర్పు నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న యలమంచిలి రవి కూడా రాధా పోటీ చేస్తే తాను మద్దతిస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇది ఒకరకంగా రాధాకు సానుకూల పరిణామమే. యలమంచిలి రవి, వంగవీటి రాధా కలసి పనిచేస్తే నియోజకవర్గంలో గెలుపు సాధ్యమవుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా రాధా మాత్రం ఎటువంటి నిర్ణయం ప్రకటించడం లేదు. పోనీ పార్టీ మారాలనుకున్నా గత అనుభవాలు గుర్తుకు వస్తున్నాయి. రాధా అనుచరుుల మాత్రం జనసేనలోకి వెళ్లాలని వత్తిడి చేస్తున్నారు. అయినా పార్టీ మారేందుకు రాధా సుముఖంగా లేరు. అలాగని తూర్పు నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో వైసీపీ అధిష్టానం మరోసారి రాధాతో చర్చలు జరపాలని నిర్ణయించింది. రాధా ఎప్పుడు మౌనం వీడతారో చూడాలి మరి.

Similar News