ముందు గొయ్యి.. వెనుక నుయ్యిలా మారిపోయింది ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ పరిస్థితి! ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే వైసీపీలో రాజుకుంటోంది. భవిష్యత్‌లో టికెట్ల సర్దుబాటు వల్ల ఎన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో వాటన్నింటికీ ఇప్పుడొక ఉదాహరణగా కనిపిస్తోంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం! మున్ముందు పార్టీలో పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. ఎన్నికలే కాదు.. అభ్యర్థుల ఎంపిక కూడా కత్తి మీద సాము లాంటిదే అని.. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయనకు అనుభవ పూర్వకంగా తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధ, మల్లాది విష్ణు పోటీ పడ్డారు. అయితే మల్లాది వైపే జగన్ మొగ్గు చూపారు. విజయవాడ రాజకీయాల్లో బలమైన సామాజికవర్గానికి చెందిన రాధను దూరం చేసుకోవడానికి కారణమేంటి? అనే ప్రశ్న అందరిలోనూ వినిపిస్తోంది. మరి వంగవీటి రాధాకు కలసిరాని అంశాలేంటి? ఏఏ అంశాలను బేరీజు వేసుకుని జగన్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు? వీటిని జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారు అనే అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
అనుకూలంగా మలచుకునే శక్తి....
విజయవాడ సెంట్రల్‌లో వంగవీటి రాధా సీటుకు వైసీపీ ఎసరు పెట్టింది.. రాధాకు సీటు నిరాకరించడానికి ప్రధాన కారణం ఓట్లు పడవేమోనన్న భయం కాదనే తెలుస్తోంది. రాధా ఆర్థికంగా బలవంతుడు కాకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కోస్తాంధ్రలోని కాపు సామాజికవర్గంలో వంగవీటి కుటుంబానికి మంచి పట్టు ఉన్నప్పటికీ.. దానిని అనుకూలంగా మలుచుకునే శక్తి ఆయనకు లేదని వైసీపీ అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకు మొండిచేయి చూపితే కాపుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే, దీని నుంచి బయటపడేందుకు మరో వ్యూహం కూడా ఆలోచించింది. కాపు ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న విజయవాడ తూర్పు నుంచి గానీ, మచిలీపట్నం పార్లమెంటు నుంచి గానీ పోటీచేసేందుకు ఆయనకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక గుంటూరు ఎంపీగా టీడీపీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన గల్లా జయదేవ్ బరిలో నిలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఆ వర్గాలను ఆకట్టుకునేందుకు......
ఇక్కడ కాపు సామాజికవర్గం అభ్యర్థిని బరిలో దింపితే ఆ ఓట్లన్నీ తమకు పడతాయని వైసీపీ అంచనా వేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించి ఆ వర్గాల ఆగ్రహానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం ప్రారంభించినట్లు సమాచారం. గుంటూరు ప్రభావం కృష్ణా జిల్లాలోనూ ఉండే అవకాశం ఉండటంతో రాధాకు టికెట్ నిరాకరించడం ద్వారా జరిగిన డ్యామేజీని ఇలా పూడ్చుకోవచ్చని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయను వైసీపీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో నిలిపి పరాభవం ఎదుర్కొంది. ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన కృష్ణదేవరాయలును బరిలో నిలిపి ఆ వర్గాన్ని ఆకర్షించాలని భావిస్తోంది. కృష్ణదేవరాయలును అభ్యర్ధిగా ప్రకటించడం ద్వారా బలమైన సామాజికవర్గం ఓట్లను ఆకర్షించవచ్చనేది వైసిపి వ్యూహాంగా కనిపిస్తోంది.
బీసీ ఓట్లను......
ఇక చిలకలూరిపేట అసెంబ్లీ స్థానానికి కమ్మసామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్‌ను కాదని, బీసీ నేత రజనీని అభ్యర్థిగా ప్రకటించారు జగన్. ఎంపీగా కమ్మ సామాజికవర్గం అభ్యర్థి ఉన్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థిని మార్చడం ద్వారా ఎలాంటి నష్టం ఉండదని, పైగా బీసీల ఓట్లన్నీ తమ ఖాతాలో పడతాయని అంచనా వేస్తోంది. ఆర్థికంగానూ రజనీకి బలం ఉంది. ఈ పార్లమెంటు పరిధిలోని ఇతర అసెంబ్లీ అభ్యర్థులకు కొంత వరకు ఆర్థిక సాయం చేస్తానని రజనీ హామీ ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా అంగ, అర్థ బలం ఉన్న నేతలను ఎంపిక చేయడం ద్వారా ప్రత్యర్థులను గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీకి కమ్మ సామాజిక వర్గం అండగా నిలిస్తే, జనసేనకు కాపు వర్గం సపోర్ట్ ఇస్తోంది. ఈ రెండు వర్గాల ఓట్లను చీల్చడం ద్వారా ఎన్నికల్లో పైచేయి సాధించాలని వైసీపీ భావిస్తోంది.