మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తున్న నాయకులు తమకు అనుకూలంగా ఉన్న పార్టీలను అధినేతలను ఎంచుకునే పనిలో పడడం గమనార్హం. నిజానికి ఏ పార్టీ అయినా.. తమకు అనుకూలంగా ఉన్న అభ్యర్థలకు టికెట్ ఇస్తుంటాయి. కాని, మారిన ట్రెండ్ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులే పార్టీలను ఎంచుకుని జంప్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎలాంటి ఊపూ లేని పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో ఇప్పుడు ఊపు కనిపిస్తోంది. కీలక నాయకులు ఆ పార్టీ కండువా కప్పుకొంటున్నారు. తాజాగా నాదెండ్ల మనోహర్ వంటి డీసెంట్ నాయకులు పార్టీ కండువా కప్పుకొని పవన్‌కు జైకొట్టడంతో రాజకీయల్లో మంచి ఊపు కనిపిస్తోం ది.
ఊపు కన్పిస్తుందని....
ఇక, ఇదే బాటలో జనసేనలోకి వెళ్లేందుకు విజయవాడకు చెందిన కీలక నాయకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ వీటి రాధాకృష్ణ కూడా రెడీ అవుతున్నారని సమాచారం. ఆయన ఇప్పటికే రెండు పార్టీలను మారారు. గతంలో కాంగ్రె స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో పవన్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లి టికెట్ సంపాదించినా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నా.. అధినేత జగన్ ఇవ్వనని కరాఖండీగా చెప్పడంతో ఆయన తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఈ క్రమంలో తనకు సెంట్రల్ నియోజవకర్గం టికెట్ కావాలని ఆయన కూడా భీష్మించారు. అయితే, దీనిపై జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు.
వత్తిడి తెస్తున్న అనుచరులు.....
అవనిగడ్డ, విజయవాడ తూర్పు, మచిలీపట్నం ఎంపీ టికెట్లను వైసీపీ ఆఫర్ చేసినా. తాను ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఉన్నందుకు ఎలాంటి విలువ లేకుండా చేశారని రాధా తీవ్రంగా మధన పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీని దెబ్బకొట్టడంతోపాటు తన మార్గం తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. దీంతో ఆయన జనసేనలోకి వెల్లాలని నిర్ణ యించుకున్నారు. జనసేనలోకి మారాలని అనుచరులనుంచి కూడా వత్తిడి ఎదురవుతోంది. దీనివల్ల తనకు సెంట్రల్ టికెట్ దక్కడంతోపాటు.. కాపు సామాజికవర్గంలో మెజార్టీ జనాలు వైసీపీకి వ్యతిరేకంగా మారడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయనకు అత్యంత సహచరులుగా ఉన్న ఇద్దరితో జనసేన అధినేత పవన్‌తో చర్చలు కూడా జరిపారని అంటున్నారు. దీనిపై రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పవన్ పార్టీలోకి రాధా వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.