అవును! తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వంగవీటి రంగా వారసుడు రాధా.. ముందు చేయాల్సిన పని ఏదైనా ఉంటే.. ఇదే! అంటున్నారు రాధా రంగా మిత్రమండలి వ్యవస్థాపకుల్లో మిగిలిన ఒకరిద్దరు వృద్దులు. రాధా రంగా మిత్రమండలి ఏర్పాటు చేసి దాదాపు 40 ఏళ్లు దాటుతోంది. ఈ క్రమంలో ఇటీవల విజయవాడలోని గాంధీ నగర్‌లో అప్పటి మిత్రమం డలిలో కీలకంగా వ్యవహరించిన నాయకులు(ఇప్పుడు వృద్ధులు అయిపోయారు) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాధా రాజకీయాలపై వారు చర్చించారు. నాడు రంగా ఏ పార్టీనైనా ఢీకొట్టే రేంజ్‌లో ఏ నాయకుడికైనా కంటిమీద కునుకు పట్టని విధంగా సానుకూల పద్ధతిలో చేసిన రాజకీయాలను వారు ప్రస్తావించారు. నియోజకవర్గంతో సంబంధం లేకుండా వంటవీటి రంగా ప్రజలకు సేవ చేశారని వారు చర్చించుకున్నట్టు తెలిసింది.
తల్లి నిలదొక్కుకోలేక......
ఇప్పుడు ఎన్నికలు ముసురుకొస్తున్న సమయంలో గెలుపు గుర్రం ఎక్కాల్సిన అత్యవసర పరిస్థితి వంగవీటి రాధాపై ఉందనేది వారి ధృడ అభిప్రాయం. నిజానికి రంగా తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఆయన వారుసురాలిగా ఆయన సతీమణి రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చినా... నిలదొక్కుకోలేకపోయారు. ముఖ్యంగా ఏ మాస్ ప్రజలు రంగాకు వెంట నిలిచారో.. వారిని ఆమె స్వయంగా దూరం గా చేసుకున్నారు. ఫలితంగా రాజకీయంగా కేరాఫ్ లేకుండా పోయారు. ఇక, ఆ తర్వాత రంగా వారసుడిని నేనేనంటూ రంగంలోకి దూకిన రాధాపై అదే మాస్ జనాలు సహా రంగా అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు. తమకు ఏ కష్టమొచ్చినా.. పెద్దదిక్కు ఒకటి ఉందనే రేంజ్‌లో విజయవాడ ప్రజలు నియోజకవర్గాలకు అతీతంగా ఫీలయ్యేవారు.
కాంగ్రెస్ ను వదిలినప్పుడే......
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితిని రాధా కల్పించలేకపోయారు. ఆయన పార్టీలు మారుతూ.. పార్టీలపై ఆధారపడ్డారే కానీ, వ్యక్తిగ తంగా తన తండ్రి వేసిన బాటను ఆయన అనుసరించలేకపోయారు. పార్టీలకు అతీతంగా ఆయన సంపాయించుకున్న అభిమానాన్నిజనాలను కూడా రాధా సంపాయించుకోకపోవడం గమనార్హం. ఇక, అత్యంత కీలకమైన కాంగ్రెస్‌ను ఆయన విడిచి పెట్టడాన్ని చాలా మంది రంగా అభిమానులు తప్పుపడుతున్నారు. ఇక, ఇప్పుడైనా రంగా వారసుడిగా రాధా నిత్యం ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇంటికి పరిమితం కాకుండా....
ఆర్థికంగా చితికిపోయినా.. ఆదుకునేందుకు రంగా అభిమానులు చాలా మందే ఉన్నారని, రాధా కాలుబయటకు పెడితే.. మేమున్నామంటూ.. రంగా అభిమానులు వస్తారని రాధా రంగా మిత్రమండలి సీనియర్లు చెబుతున్నారు. ఏదేమైనా.. ఇంటికే పరిమితం కావడం రంగా చరిత్రలోనే లేదని, రాధా ఈ విషయాన్ని తెలుసుకోవాలని, లేకుంటే.. రాబోయే రోజుల్లో విజయవాడలో రంగా ఎవరని అడిగే రోజులు వచ్చే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. మరి ఈ యువ నాయకుడు వింటాడా? చూడాలి..!