పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అంతా నాదే.. అనుకున్న నాయకులు కూడా బొక్క బోర్లా పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిణామమే కృష్ణా జిల్లా టీడీపీలో వెలుగు చూడనుందని అంటు న్నారు పరిశీలకులు. ప్రధానంగా ఇక్కడ టీడీపీ డామినేషన్ ఎక్కువగా ఉంది. అంతేకాదు, ఇక్కడి నాయకుల్లో ఎక్కువగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. దీంతో ఇక్కడ టీడీపీ పాగా వేసింది. ముఖ్యంగా మైలవరం, గన్నవరం, విజయవాడ నగరంలోని సెంట్రల్, తూర్పు, పెనమలూరు నియోజకవర్గాలు జిల్లా పరిధిలో ఎంతో కీలకం. అలాంటి చోట్ల కూడా టీడీపీ పాగా వేసింది. ఇక, విజయవాడలోనూ టీడీపీ జోరుమీదుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఈ జిల్లాలో పాగా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పార్టీని పరుగులు పెట్టించేందుకు....
దీనిని గమనించిన వైసీపీ అధినేత జగన్.. పార్టీకి కాయకల్ప చికిత్స చేసి.. పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే కొత్త నీటికి దారిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో బలమైన వర్గంగా పేరున్న నేతలకు ఆయన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈ క్రమలోనే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ హోం మంత్రి, టీడీపీలో బలమైన నాయకుడు, ఏపీ ఆప్కాబ్ మాజీ చైర్మన్.. వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ ను జగన్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. కైకలూరు నియోజకవర్గంలో జగన్‌ను కలిసి ఆయన సమక్షంలో తండ్రికొడుకులు ఇద్దరూ జగన్ పార్టీలో చేరిపోయారు.
టీడీపీ అనేక ప్రయత్నాలు చేసినా....
ఈ విషయంపై గత కొన్నాళ్లుగా చర్చలు సాగడం, మైలవరం నుంచి కేపీ పోటీకి జగన్ పచ్చజెండా ఊపడంతో పరిస్థితిలో సానుకూలత ఏర్పడింది. అయితే, కేపీని అడ్డుకునేందుకు అధికార టీడీపీ నేతలు ఎన్నో విధాల ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో కేపీ.. తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మైలవరం నుంచి పోటీ చేయనున్నారు. అయితే, కేపీ రాకతో.. ఒక్క మైలవరంలోనే టీడీపీపై ప్రభావం పడుతుందంటే సరికాదు., కేపీ ప్రభావం జిల్లాలోని మూడు నియోజకవర్గాలపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది.
ఈ మూడు నియోజకవర్గాల్లో.....
పశ్చిమ కృష్ణాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో టీడీపీకి భారీగా ఎఫెక్ట్ పడనుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ వసంత అభిమానులు ఉన్నారు. గతంలో వసంత నాగేశ్వరరావుకు మంచి పట్టున్న ఈ జిల్లాలో ఇప్పటికీ ఆయన హవా కొనసాగుతోంది. ఈ పరిణామాలు ఆయన కుమారుడికి ప్లస్ కానున్నాయి. వచ్చే దఫా ఎన్నికల్లో కేపీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొంటున్నందున జిల్లాలో వసంత వేడి పెరగనుంది. వసంత ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, గతంలో హోం మంత్రిగా కూడా పనిచేసి ఉండడంతో ఈ ప్రభావం ఇప్పటికీ జిల్లాపై ఉంది. ఆయన చేసిన సేవలను జిల్లాలో ఇప్పటికీ ప్రజలు మననం చేసుకుంటూనే ఉన్నా రు.
బలమైన క్యాడర్....
ఇక, ఇప్పుడు ఆయన కుమారుడు రంగంలోకి దిగుతుండడంతో ఈ ఊపు, ఉత్సాహం మరింతగా కనిపిస్తోంది. వసంత నాగేశ్వరరావు గతంలో నందిగామ నుంచి, జగ్గయ్య పేట నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. బలమైన కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక, కృష్ణ ప్రసాద్ కూడా నందిగామ నుంచి పోటీ చేశారు. ఈయనకు కూడా ఈ నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఉంది. ఇక, ఇప్పుడు మైలవరం నుంచి కేపీ రంగంలోకి దిగుతున్నారు. ఈ పరిణామం మరిం తగా వైసీపీకి కలిసి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఈ మూడు చోట్లా సైకిల్ జోరుకు ఫ్యాన్ గాలితో బ్రేకులు పడడం ఖాయమన్న చర్చలు జిల్లాలో స్టార్ట్ అయ్యాయి. ఇక కేపీ మైలవరంలో పోటీకి దిగుతుండడంతో మంత్రి ఉమకు చెమటలు పట్టడం ఖాయమన్న టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది.