భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బంది ఏర్పడిందనే చెప్పాలి. వెంకయ్యనాయుడు రెండురోజుల ఏపీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, మోదీ విజన్ ఉన్న నాయకులు అని వెంకయ్యనాయుడు అనడంతో కొంత తెలుగుదేశం నేతలు సంబరపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వెంకయ్య వ్యాఖ్యలు తమకు ఉపయోగపడతాయని భావించారు. వెంకయ్యనాయుడు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ పొత్తు వెంకయ్య పుణ్యమేనన్నది అందరికీ తెలిసిందే. మోదీ ఈ పొత్తు పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేసినా బలవంతంగా ఒప్పించి పొత్తును ఖరారు చేశారు వెంకయ్య నాయుడు.
ఉపరాష్ట్రపతిగా వెళ్లడంతో.....
అలాంటిది వెంకయ్యనాయుడు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికయిన అనంతరం ఆయన పార్టీ వ్యవహారాల్లో తలదూర్చడం సాధ్యం కాని పని. అంతేకాదు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాకముందు వరకూ ఏపీ ప్రయోజనాల పట్ల అత్యంత శ్రద్ధ వహించేవారు. అనేక విద్యాసంస్థలు,పక్కా ఇళ్లు, వివిధ కేంద్ర సంస్థలు ఏపీకి పరుగులు తీయడం వెనక వెంకయ్య ఉన్నారనేది కాదనలేని వాస్తవం. వెంకయ్య ఉప రాష్ట్రపతిగా వెళ్లిన నాటి నుంచి హస్తినలో పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు కూడా ఇక తన మాట నెగ్గదని భావించి బీజేపీకి రాంరాం చెప్పేశారు.
జాతీయ రాజకీయాల్లో.....
ఈపరిస్థితుల్లో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించాలని భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేక శక్తులన్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా హస్తం పార్టీకి దగ్గరవుతున్నారు. లోక్ సభలో అవిశ్వాసం పెట్టిన సందర్భంలోనూ కాంగ్రెస్ మద్దతివ్వడం, ప్రత్యేక హోదా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇస్తామని రాహుల్ ప్రకటనను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. పొత్తు కుదిరినా,కుదరకున్నా వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించే అవకాశముంది.
ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చి.....
ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన సామాజిక వర్గానికి వెంకయ్య వ్యాఖ్యలు చేరిపోయాయి. విజయవాడలో జరిగిన ఆత్మీయసభలో వెంకయ్య మాట్లాడుతూ తాను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాననే 1983లో ఎన్టీరామారావు తాను ఓడిపోకూడదని కోరుకున్నారని చెప్పారు. తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే ముందు కూడా దగ్గుబాటి చెంచురామయ్య తన వద్దకు వచ్చి చెప్పారన్నారు. అంటే వెంకయ్యనాయుడు పరోక్షంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకమని, అలాంటి చర్యలకు దిగవద్దని చంద్రబాబుకు పరోక్షంగా చురకలు అంటించినట్లయింది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కు చంద్రబాబు దగ్గరయితే సొంత సామాజికవర్గం నుంచే వ్యతిరేకత వస్తుందన్నది వెంకయ్య వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది.