రాజధాని జిల్లా కృష్ణాలోని ప్రధాన నగరం విజయవాడ ఎంపీ సీటు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. ప్రముఖ వాణిజ్య ప్రాంతం కావడంతో ఇక్కడ నుంచి పార్లమెంటుకు వెళ్లేందుకు నేతలు ఉత్సాహం చూపుతారు. అవసరమైతే.. ఎంతైనా ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడని పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ వరుస పెట్టి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీగా గెలుగుస్తున్నారు. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం, కాంగ్రెస్‌లే ఈ నియోజకవర్గాన్ని పంచుకుంటున్నాయి. 2004కు ముందు టీడీపీ నాయకుడు గద్దె రామ్మోహన్ ఎంపీగా ఉన్నారు. అయితే, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ విజయం సాధించారు.
గత ఎన్నికల్లో....
ఇక, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కేశినేని నాని గెలుపొందారు. అదేసమయంలో ఇక్కడ వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికే చెందిన అభ్యర్థి కోనేరు ప్రసాద్ ను బరిలోకి దించింది. అయితే కేశినేని నాని స్థానికుడు. అందరికీ తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకలా సాగిపోయింది.ఇక, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రానున్నాయి. మరో ఏడాదిలోనే నగారా మోగనుంది. ఈ క్రమంలో వైసీపీ తరఫున అభ్యర్థి ఎవరు ? అనే అంశం తెరమీదికి వస్తోంది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైసీపీ అధినతే జగన్.. ఎంపీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చుకు వెనుకాడకుండా చేసే వారికే తొలి ప్రాధాన్యం అంటున్నారు.
వైసీపీకి రాజీనామా చేయడంతో....
గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేరు ప్రసాద్ భారీగానే ఖర్చు చేశారు. ఆయన జనాల్లో అంతగా కలిసిన వ్యక్తి కాకపోవడంతో విజయవాడ ఓటర్లు ఆయన్ను పట్టించుకోలేదు. కొద్ది రోజులకే ఆయన వైసీపీకి రాజీనామా చేసేశారు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాను ప్రధానంగా టార్గెట్ చేస్తోన్న ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా ఇక్కడ టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటోన్న ఆ సామాజికవర్గాన్ని తన వైపునకు తిప్పుకునేందుకు మెజార్టీ సీట్లు వారికే ఇస్తున్నారు. ఇక విజయవాడ ఎంపీ సీటు విషయానికి వస్తే ఈ క్రమంలోనే ఈ సీటు ప్రధానంగా ఎన్నారైలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నారైలతో సంప్రదింపులు....
కృష్ణా జిల్లాలో ఉండి అమెరికాలో స్థిరపడిన సంపన్నులు, రాజకీయ అభిలాష ఉన్నవారి కోసం వైసీపీ నేతలు ప్రయ త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముఖులను కూడా వైసీపీ నేతలు సంప్రదిస్తు న్నట్టు తెలుస్తోంది. అయితే, ఎవరూ కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కోనేరు ప్రసాద్ అనుభవమే కావచ్చనేది కథనం. అయితే, ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్‌తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ హయాం నుంచి ఈ కుటుంబంతోనే ఉంటున్న ఘట్టమనేని.. నిన్నటికి నిన్న విశాఖలో జరిగిన వంచన వ్యతిరేకదీక్షకు కూడా హాజరై నిరసనలో పాల్గొన్నారు. ముందుగా నందిగామ నియోజకవర్గానికి చెందిన సురేష్ అనే ఎన్నారైను జగన్ సంప్రదించగా ఆయన ఆసక్తి చూపలేదట. ఇక మరో ఇద్దరు ఎన్నారైలతో సంప్రదింపులు జరుగుతుండగానే ఆదిశేషగిరిరావు అయితే బలమైన అభ్యర్థి అవుతారన్న భావనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.