ఓటుకు నోటు...చంద్రబాబు మంచికేనా?

Update: 2018-05-08 03:30 GMT

ఓటుకు నోటు కేసులో నిజంగానే కేసీఆర్ చర్యలకు దిగితే అది చంద్రబాబుకు లాభిస్తుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులకు మరికొంత సెంటిమెంట్ తోడవుతుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఏళ్లుగా ఓటుకు నోటు కేసును పట్టించుకోని కేసీఆర్ హటాత్తుగా ఈ కేసును బయటకు తీయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఈ కేసుపై నాలుగు గంటల పాటు సమీక్ష జరిపారంటే ఇందులో కమలనాధుల ప్రమేయం ఉందని కూడా కొందరు సైకిల్ పార్టీ నేతలు బయటకు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.

హైదరాబాద్ టు అమరావతి.....

రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. అయితే ఇదే సమయంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేలా అవకాశమూ కల్పించింది. కాని పరిపాలన ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు వెంటనే తన మకాంను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారు. అయితే ఓటుకు నోటు కేసు బయటకు రావడం, తమ ఫోన్లు ట్రాప్ అవుతున్నాయని తెలిసి చంద్రబాబు హడావిడిగా అమరావతికి వెళ్లారన్న విమర్శలూ లేకపోలేదు.

గవర్నర్ పై అనుమానాలు....

ఓటుకునోటు కేసు జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పట్టించుకోలేదు. న్యాయస్థానంలో నలుగుతున్న కేసు కాబట్టి కొంత సమయం తీసుకున్నారని అనుకోవచ్చు. అయితే రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ తో సమావేశమైన కేసీఆర్ ఈ కేసుపైనే చర్చించినట్లు వార్తలొచ్చాయి. నరసింహన్ తో భేటీ తర్వాత ఓటుకు నోటు కేసును కేసీఆర్ సమీక్షించడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ బీజేపీ ఏజెంటుగా తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

సైకిల్ కు మరో సెంటిమెంట్....

కేసీఆర్ ఈ కేసు విషయంలో దుందుడుకు చర్యలకు దిగితే తమకే మంచిదంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబుపై ముప్పేట దాడి జరగుతుందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామంటున్నారు. అంతేకాదు హైదరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తమ నేతపై పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసులు పెట్టడాన్ని కూడా ఏపీ ప్రజలు సహించరని టీడీపీ నేతలు మీడియా చర్చల్లో ఇప్పటికే మొదలుపెట్టేశారు. ఇలా ఓటుకు నోటు కేసు కేసీఆర్ బయటకు తీయడం తమకు మంచిదేనని, ప్రస్తుతం కొంత ఇబ్బందుల్లో ఉన్న తమ పార్టీకి మంచి మైలేజీ వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Similar News