'జబ్బు పడ్డ' మావోయిస్టు పార్టీ ! గణపతి మంచానికి పరిమితం?
మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మంచానికే పరిమితమైనట్టు అనధికార వార్తలు అందుతున్నవి.
'జబ్బు పడ్డ' మావోయిస్టు పార్టీ !
గణపతి మంచానికి పరిమితం?
SK.ZAKEER
మావోయిస్టు పార్టీ మాజీ కార్యదర్శి ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మంచానికే పరిమితమైనట్టు అనధికార వార్తలు అందుతున్నవి. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గణపతి వయస్సు 75 కు చేరింది. బీపీ,షుగర్, మోకాళ్ల నొప్పులు,అల్జీమర్స్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
దీర్ఘకాలిక రుగ్మతలతో మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టు మాజీ మావోయిస్టు నాయకుడొకరు 'తెలుగుపోస్టు'కు చెప్పారు.అడవుల్లో వైద్యం అందక బయటికి రాలేక అవస్థలు పడుతున్నట్టు చెప్పారు. 30 మందికి పైగా సీనియర్ నాయకులు అనారోగ్యం పాలయినట్టు మాజీ మావోయిస్టు కథనాన్ని బట్టి తెలుస్తోంది.దశాబ్దాలుగా అడవుల్లో ఎన్నో విపత్కర పరిస్థితుల మధ్య పోరాడుతున్న నాయకులు ఇప్పుడు అనేక జబ్బులతో పోరాడలేక ప్రాణాలు విడుస్తున్నట్టు సమాచారం అందుతోంది. అడవుల్లో సరైన వైద్య సాయం అందక, కొన్నిసార్లు మందులకు తీవ్ర కొరతతో కొట్టుమిట్టాడుతున్నారు.
వైద్యం కోసం అడవులు వదిలితే పోలీస్ బలగాలకు చిక్కుతామని అడవి వెలుపలికి రావడం లేదు.తప్పని పరిస్థితుల్లో అడవుల్లోనే ఉండి చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా సమయంలో ఎలాగోలా బతికి బయటపడినా.పోస్ట్ కోవిడ్ సమస్యలు ఇప్పుడు వారిని మరింత కుంగదీస్తున్నవి.రెండేళ్లలో కనీసం నలుగురైదుగుఋ కీలక నాయకులను మావోయిస్టు పార్టీ పొగగొట్టుకున్నది. అగ్రనాయకులైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, హరిభూషణ్, మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు,సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్,మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న అడవి ఒడిలోనే ప్రాణాలు వదిలారు. మావోయిస్టు కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన వారిలోనూ దాదాపు 30కి పైగా మావోయిస్టు కీలక నాయకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
పోలీసు బలగాల పహారా,నిఘా,సాంకేతిక పరిజ్ఞానం పెరిగినందున మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గతంలో మాదిరిగా స్థానికుల నుంచి మద్దతు తగ్గింది.అందుకే సకాలంలో ఔషధాల రవాణా,ఇతర సహాయ సహకారాల్లో జాప్యమవుతోంది. అయితే వైద్య కోసం వచ్చే మావోయిస్టులకు మందులు, వైద్య చికిత్స అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే మావోయిస్టుల మరణాలు జరుగుతున్నాయన్నది మావోయిస్టు పార్టీ ఆరోపణ.కటకం సుదర్శన్ మృతిపై ప్రకటనల మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఈ మాట అన్నారు.అనారోగ్యంపాలైన మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే మెరుగైన వైద్య సేవలందిస్తామని తాము బహిరంగంగా, మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని పోలీసుల వాదన.
మావోయిస్టు పార్టీ నేతలు దీర్ఘకాలంగా అడవుల్లో అజ్ఞాతవాసంలో పోలీసుల కళ్ళు కప్పి పోరాటాలు నడపడంతో వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నవి. ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, శారీరక శ్రమ వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు సీనియర్ నాయకులను చుట్టుముట్టినట్టు తెలుస్తోంది.మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్, సత్వాజీ, పుల్లూరి ప్రసాదరావు, మల్లోజుల వేణుగోపాల్‌రావు వంటి నేతలు కూడా వయోభారంతో ఉన్నారు.
(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)