గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. కంచుకంఠంతో విపక్షాలకు చెక్ పెట్టి.. నిత్యం మీడియాలో నిర్మాణాత్మక పాత్ర పోషించిన టీడీపీ దివంగత నాయకుడు. అధికారంలో ఉన్నా.. లేకున్నా పార్టీ కోసం శ్రమించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజాపై పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. మరి ఇప్పుడు మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో టీడీపీ టికెట్‌పై నగరి నుంచి పోటీ చేయడానికి గాలి ముద్దకృష్ణమ వారసులు పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికి టికెట్ ఇచ్చేందుకు తాను సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. అయితే... వీరిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. ప్రధానంగా గాలి జీవించి ఉన్నరోజుల్లో ఆయన పెద్ద కుమారుడు భాను ప్రకాష్‌ను రంగంలోకి దించాలని ఆశించారు.
గాలి మరణం తర్వాత....
ఈ క్రమంలోనే గాలి ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా.. భాను ప్రకాష్‌ను వెంటబెట్టుకుని ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలకు భాను అన్నగా పరిచయం చేశారు. కానీ, గాలి మరణానంతరం కుటుంబ రాజకీయాల్లో పీటముడి పడింది. ఇద్దరు తనయులు కూడా ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ టికెట్‌పై ఎలాంటి నిర్ణయమూ తేలలేదు. మొన్నీమధ్య చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని పిలిచి.. మాట్లాడినా..కూడా ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోపక్క వైసీపీ ఎమ్మెల్యే రోజా మాత్రం దూకుడు ప్రదర్శిస్తున్నారు. గాలి వారసులను అడ్రస్ లేకుండా చేసే క్రతువులో భాగంగా ఆమెప్రజలకు చేరువ అయ్యారు. ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆమె.. తాజాగా రూ.4 కే అన్నం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారంలో మూడు రోజులు స్థానికంగా అందుబాటులోనే ఉంటున్నారు. తన తరఫున ఇద్దరు పీఏలను కూడా ఆమె నియమించారు.
సొంత ఇల్లు కట్టుకుని మరీ...
స్థానికంగా ఉండరన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రోజా నగరిలో సొంత ఇళ్లు కూడా కట్టుకున్నారు. నియోజకవర్గంలో సమస్యలపైనా ఆమె వెంటనే స్పందిస్తున్నారు. ఏ సమస్యపైనైనా ప్రభుత్వంతో పోరాడుతున్నారు. అధికారులను బుజ్జగించి కూడా పనులు చేయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేసమయంలో ఆమె తన పేరుతో ఓ మొబైల్ యాప్‌ను రూపొందించారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా.. ఈయాప్‌లో ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆమె వాటిని పరిష్కరించేలా కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. దీంతో రోజా దూకుడు జోరందుకుంది.
గాలి తనయులు మాత్రం....
మరి ఇక్కడ నుంచి తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాల్సిన గాలి తనయులు మాత్రం టికెట్ కోసం కుస్తీ పడుతూ.. ఇప్పటి వరకు ఇంటికే పరిమితమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను కానీ, ప్రజలను కలిసి వారి సమస్యలు వినేందుకు కానీ చొరవ చూపించడం లేదు. పైగా టికెట్ మాకంటే మాకేనని పార్టీలో ప్రకటిస్తుండడంతో తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గాలి తనయులు పనిగట్టుకుని రోజాను గెలిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతుండడం గమనార్హం. మరి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి.