వ్యూహం-ప్రతి వ్యూహం లేనిదే.. రాజకీయాలు రక్తి కట్టవు. మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికల నగారా మోగనున్న ఏపీలో అధికార పక్షానికి షాకి వ్వాలని భావిస్తున్న ప్రధాన, ఏకైక విపక్షం వైసీపీ ఆదిశగానే అడుగులు వేస్తోంది. జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్న పార్టీ అధినేత జగన్.. గెలుపు గుర్రాలను, అధికార పార్టీ నేతలను ఓడించగలిగే సత్తా.. అన్ని విధాలుగా ఉన్న వారిని మాత్రమే ఆయన చేరువ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు పార్టీలో సేవ చేసిన, అంకిత భావంతో వ్యవహరించిన నాయకులను కూడా జగన్ పక్కన పెట్టారు ఆయా నియోజకవర్గాల్లో ఆర్థికంగా, సామాజికంగా కూడా బలమైన నాయకులను రంగంలోకి దింపుతున్నారు. తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లాపైనా జగన్ దృష్టి పెట్టారని సమాచారం. గత ఎన్నికల్లో ఇక్కడ బలమైన పార్టీగా నిలిచింది వైసీపీ. అయితే, అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంతో ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు క్యూకట్టుకుని మరీ సైకిల్ ఎక్కారు.
క్లీన్ స్వీప్ చేయాలని.....
దీంతోప్రకాశంలో వైసీపీ కొంత మేరకు పలచన అయింది. నేతలు పార్టీని వదలి వెళ్లిపోయినా క్యాడర్ మాత్రం బలంగా ఉంది. అదేసమయంలో టీడీపీ పుంజుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిని గమనించిన జగన్.. ఎలాగైనా టీడీపీని నిలువరించి... వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్పుల దిశగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రకాశంలో పాదయాత్ర నిర్వహించిన సమయంలో ఇక్కడి రాజకీయ పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించిన జగన్.. కందుకూరు, సంతనూతలపాడు, పర్చూరు, కొండేపి స్థానాలకు కొత్త ఇంచార్జులను నియమించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారపార్టీకి ధీటుగా అభ్యర్ధుల ఎంపిక సమస్యగా మారింది. ఆశావహులపై చేయించిన సర్వేల్లో సానుకూలత రాలేదని తెలుస్తోంది. జగన్ బంధువు, పార్టీ జిల్లా అద్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఒంగోలుతో పాటు గిద్దలూరుపైనా దృష్టి పెట్టగా ఒంగోలు నుంచే పోటీ చేయాలని అధినేత చెప్పినట్లు సమాచారం.
బూచేపల్లికే తిరిగి.....
అక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచిన బాలినేని.. గత ఎన్నికల్లో దామచర్ల జనార్ధన్ చేతిలో ఓటమి చెందారు. అభివృధ్ధి విషయంలో దామచర్ల దూకుడు ప్రదర్శించడంతో బాలినేని పక్క చూపులు చూస్తున్నారని ప్రచారం. ఒకవేళ బాలినేని గిద్దలూరు వెళితే మద్దిశెట్టిని ఒంగోలులో పోటీ చేయించటానికి సమాలోచలను చేస్తున్నారు. మరో కీలక నియోజకవర్గం దర్శి. ఇక్కడ టీడీపీ సీనియర్ దిగ్గజం, మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని పక్కన పెట్టిన జగన్.. బాదం మాధవరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. అయితే, ఇక్కడి పరిస్థితిని గమనించి, సిద్దా ముందు తాను గెలుపు గుర్రం ఎక్కలేనని భావించి కాడి కిందేయటంతో బూచేపల్లి కుటుంబానికే తిరిగి భాధ్యతలు ఇచ్చేందుకు ప్రయత్నంచారు.
వచ్చే నెల తర్వాతే......
అయితే, బూచేపల్లి మాత్రం తాను డిసెంబరు తర్వాత నిర్ణయం చెబుతానని తేల్చేశారు. దీంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి. పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్‌ను రంగంలోకి దించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, పర్చూరు నియోజకవర్గానికి భరత్.. ఇప్పుడు రావా రామనాధం ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే చర్చ సాగుతోంది. తన కుమారుడు హితేష్ చెంచురాంను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. ఇక్కడ పోటీ ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం. ఇక్కడ నుంచి ఏలూరి సాంబశివరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఏలూరి వంటి నాయకుడిని ఢీకొట్టే నేతను ఎంపిక చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఆయన కోసం వైసీపీ....
ఇక, చీరాలలో ఇన్ ఛార్జి యడం బాలాజీ గెలుపుపైనా పార్టీకి నమ్మకం లేదు. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవ్వటం ఆయనకు పెద్ద మైనస్. ప్రస్తుతం ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది. చంద్రబాబు ఆహ్వానంతో టీడీపీ సైకిల్ ఎక్కారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచే పోటీ చేస్తారా? లేక పార్టీ మారి.. వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా జగన్‌కు జై కొడతారా అన్నది ఉత్కంఠగా మారింది. కొండేపి విషయానికొస్తే జిల్లా స్థాయి నేతల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు ఇక్కడ వివాదాలు రాజేస్తోంది. ఇటీవలవరకు ఇన్చార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబును తప్పించి డాక్టర్ వెంకయ్యకు బాధ్యతలు అప్పగించారు. వాళ్లిద్దరు ఉప్పు, నిప్పులా మారిపోయి.. కార్యకర్తలు వర్గాలవారీ విడిపోయారు.ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో నాయకత్వ లేమి వైసీపీని వేధిస్తోంది. నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం అన్వేషణ సాగుతోంది. దీంతో .. రాబోయే నెల రోజుల్లో ప్రకాశం వైసపీలో ప్రక్షాళన ఖాయం అంటున్నారు సీనియర్లు!!