సాధారణంగా గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అరకు పార్లమెంటు స్థానాన్నికూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఎస్టీ నియోజకవర్గాలపై వైసీపీకి అంత పట్టుంది. ప్రస్తుతం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. సాలూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగుతోంది. గత ఎన్నికల్లోనూ సాలూరును వైసీపీ కైవసం చేసుకోవడంతో జగన్ పాదయాత్ర నియోజకవర్గానికి చేరుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఆ పార్టీ శ్రేణులు ఉరకలేస్తున్నాయి.
ఎస్టీ నియోజకవర్గం కావడంతో.....
సాలూరు నియోజకవర్గం 1955లో ఏర్పడింది. 1955, 1962 ఎన్నికల్లో జనరల్ కేటగిరిలో ఉన్న సాలూరు నియోజకవర్గం 1962 ఎన్నికల నుంచి ఎస్టీ నియోజకవర్గంగా మారింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగు సార్లు మాత్రమే నెగ్గడం గమనార్హం. 1985, 1994, 1999,2004 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆర్.పి.భాంజ్ దేవ్ ఇక్కడి నుంచి మూడు సార్లు టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడుసార్లు విజయం సాధించింది. మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
నమ్మకంగా పార్టీ వెన్నంటే ఉండి.....
ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజన్న దొర తెలుగుదేశం అభ్యర్థి రాజేంద్ర ప్రతాప్ భాంజ్ దేవ్ పై దాదాపు ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రాజన్న దొర నమ్మకంగాపార్టీనే అంటి పెట్టుకుని ఉండటంతో ఆయనేమరోసారి వైసీపీ అభ్యర్థి అని ఖాయంగా చెప్పవచ్చు. దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినా, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు చెందిన అధికశాతం మంది వైసీపీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసినా, రాజన్న దొర మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉండటం ఆయనకు వైసీపీ అధిష్టానం దృష్టిలో మంచి మార్కులే ఉన్నాయి.
పాదయాత్రతో.....
ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రపై రాజన్నదొర ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు విజయనగరం జిల్లాలో మంచి స్పందన కన్పిస్తోంది. సాలూరులో జరిగిన జగన్ బహిరంగ సభ సూపర్ సక్సెస్ కావడంతో రాజన్న దొర తన విజయంపై మరింత నమ్మకం పెంచుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన ఆర్ పి. భాంజ్ దేవ్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనకు కలసి వస్తుందనుకుంటున్నారు. రాజన్న దొర ఇప్పటికే 2009లో కాంగ్రెస్ తరుపున, 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మరి జగన్ పాదయాత్రతో రాజన్న దొర హ్యాట్రిక్ కల నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.