కాటసానిపై వైసీపీ అధినేత జగన్ కు నమ్మకమున్నట్లుంది. ఆయన రాకతో రాయలసీమ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని జగన్ భావిస్తున్నట్లుంది. గత నెల 29వ తేదీన పార్టీలో చేరిన కాటసానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. కర్నూలు జిల్లాలో వైసీపీకి నాయకుల కొరత లేదు. ఇప్పటికే గౌరు వెంకటరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి వంటి నేతలు ఉన్నారు. కాటసాని రాకతో బలం మరింత పెరిగిందని జగన్ భావిస్తున్నారు. కాటసానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం వెనక కూడా ఆలోచన ఉందంటున్నారు.
కాటసానికి గౌరవప్రదమైన పదవి.....
నిజానికి కాటసాని రాంభూపాల్ రెడ్డికి పాణ్యం నియోజకవర్గంలోనే మంచి పట్టుంది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. అయితే పాణ్యం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా గౌరు సుచరిత ఉన్నారు. గౌరు కుటుంబం పార్టీనినమ్ముకుని ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో పాణ్యం టిక్కెట్ గౌరు కుటుంబానికే ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు గౌరు సుచరితకు జగన్ ప్రత్యేకంగా హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం. కొత్తగా వచ్చిచేరిన వారితో ఎటువంటి ఇబ్బందులుండవని, మీ పని మీరు చేసుకోండని జగన్ చెప్పడంతో గౌరు వర్గం ఆనందంలో ఉంది.
ఎంపీగా పోటీ చేయించాలని.....
ఇక కాటసానిని వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి ఇద్దరూ వైసీపీ గుర్తు మీద గెలిచి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో రెండు పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న వైసీపీ ఈసారి కూడా ఆ రెండు సీట్లు నిలుపుకోవాలని భావిస్తుంది. ఇందుకోసం సరైన అభ్యర్థులను నిలబెట్టాలని యోచిస్తుంది. ఇందులో కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్లమెంటుకు పోటీ చేయించే ఉద్దేశ్యంలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారంటున్నారు.
పాణ్యంపై పట్టుబట్టేది లేదని.....
కాటసాని కూడా పాణ్యం టిక్కెట్ పై పెద్దగా పట్టుబట్టడం లేదు. జగన్ నిర్ణయం మేరకే నడుచుకుంటానని ఆయన చెబుతున్నారు. జగన్ తనకు ఏ పని అప్పగించినా దానిని పూర్తి చేస్తానంటున్నారు కాటసాని. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని కూడా ఆయన కార్యకర్తల సమావేశాల్లో చెబుతున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు జగన్ చేస్తున్నారని, అందుకే తాను వైసీపీలో చేరానని కాటసాని చెప్పారు. మొత్తం మీద పాణ్యం గొడవకు ఒకరకంగా జగన్ ఫుల్ స్టాప్ పెట్టినట్లేనని, కాటసాని పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించనున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.