వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న అనిత నియోజకకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు అపూర్వ స్పందన కన్పిస్తోంది. పాయకరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లోనూ వంగల పూటి అనిత విజయం సాధించారు. తక్కువ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే అనితను వైసీపీపైనా, జగన్ పైనా ప్రత్యేకంగా రోజాపైనా చంద్రబాబు అస్త్రంగా వదులుతున్నారు. అనితకు గత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందనుకున్నారు. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది. ఇటీవల టీటీడీ బోర్డు సభ్యురాలిగా తొలుత నియమించినా అది వివాదాస్పదం కావడంతో ఆమెను మళ్లీ ప్రభుత్వం తొలగించింది.
టీడీపీకి కంచుకోట.....
ఇప్పుడు అనిత నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. 1962లో పాయకరావు పేట నియోజకవర్గం ఏర్పడింది. 1962 లో తొలుత సీపీఐ అభ్యర్థిగా మందే పిచ్చయ్య విజయం సాధించారు. అక్కడి నుంచి వరుసగా 1967, 1972, 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. నియోజకవర్గం ఏర్పడినాటి నుంచి ఇది ఎస్సీ నియోజకవర్గమే. ఇక 1983లో ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి గంటెల సుమన విజయం సాధించారు. తర్వాత వరుసగా జరిగిన 1985, 1989, 1994, 1999, 2004లో ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఐదుసార్లు ఘన విజయం సాధించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావు గెలుపొందడం గమనార్హం. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గొర్ల బాబూరావు గెలిచారు. తర్వాత గొర్లబాబూరావు వైసీపీలోకి వచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో బాబూరావు వైసీపీ గుర్తు మీద విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం తిరిగి ఇక్కడ టీడీపీ కంచుకోటను నిలబెట్టుకుంది. వంగలపూడి అనిత తెలుగుదేశం అభ్యర్థిగా తన సమీప వైసీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై కేవలం 2,828 ఓట్ల తేడాతోనే గెలిచారు.
ఈసారి ఎలాగైనా గెలవాలని....
పాయకరాపుపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక్కసారి మాత్రమే వైసీపీ...అదీ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన చెంగల వెంకట్రావు ఒక హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఎలాగైనా మళ్లీ వైసీపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఇక్కడ వైసీపీ శ్రేణులు జగన్ పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా పాయకరావుపేట నియోజకవర్గంలో పాదయాత్రకు స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కన్పిస్తోంది. జోరు వానకురుస్తున్నా....జగన్ అడుగులో అడుగు వేసి నడిచేందుకు జనం పోటీ పడుతున్నారు. మొత్తం మీద పాయకరావుపేట నియోజక వర్గంలో జగన్ పాదయాత్రతో ఖచ్చితంగా గెలుస్తామన్న విశ్వాసం ఫ్యాన్ పార్టీ నేతల్లో కన్పిస్తోంది.