నెల్లూరు జిల్లా రాజకీయలు ఊపందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఇక్కడి రాజకీయాలు ఇప్పుడు పరు గు పెట్టేందుకు రెడీ అయ్యాయి. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో రివ్వున సాగిన ఫ్యాన్ జోరు మరింత పెరగనుంది. అదేస మయంలో నెల్లూరులో పాగా వేయాలని తలకిందలు పడుతున్న టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఒక్కరంటే ఒక్కరు కూడా మాస్ నాయకుడు ఆ పార్టీకి ఈ జిల్లాలో కనిపించకపోవడమే. ఇక, వైసీపీకి ఈ జిల్లాలో అన్నీతానై వ్యవహరించిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఫ్యామిలీ దెబ్బకే గత ఎన్నికల్లో టీడీపీ బేజారెత్తితే... వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మరో మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ఆనం వర్గం కూడా తోడైంది. దీంతో నెల్లూరులో టీడీపీ రాజకీయాలు ఏమవుతాయి? ఇక్కడ పార్టీ వచ్చే ఎన్నికల్లో పుంజుకుంటుందా ? అంచనాలు అందుకుంటుందా ? అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
మరింతగా దూసుకుపోయేందుకు.....
నెల్లూరు సిటీ సహా రూరల్, ఆత్మకూరు వంటి కీలక నియోజకవర్గాల్లో వైసీపీ జెండా రెపరెపలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో మరింతగా దూసుకుపోయేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ పరిణామమే టీడీపీ అధినేత చంద్రబాబును కలవరపెడు తోందని అంటున్నారు పరిశీలకులు. జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వైసీపీ జెండానే ఎగురుతోంది. వచ్చే ఎన్నికల్లో మొత్తం పది స్థానాల్లోనూ వైసీపీ ఫ్యాన్ విజృంభించేలా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక, ఇప్పటికేబలంగా ఉన్న మేకపాటి వర్గానికి ఆనం వర్గం తోడైతే.. మొత్తంగా ఇక్కడ వైసీపీ విజృంభించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి.
నాలుగేళ్లలో ఏమాత్రం......
అదే సమయంలో మాజీ సీఎం నేదురుమల్లి కుమారుడు రాం కుమార్ కూడా వైసీపీలో చేరిపోయారు. ఇది కూడా వైసీపీకి కలిసి వచ్చే పరిణామమేనని అంటున్నారు. పోనీ.. టీడీపీకి ఉన్న నాయకత్వం ఇక్కడ ఈ నాలుగేళ్లలో ఏమన్నా బలోపేతం అయిందా? అంటే అది కూడా కష్టంగానే ఉంది. మంత్రులు ఇద్దరు ఉన్నప్పటికీ.. ఎవరి వర్గాన్ని వారు కాపాడుకోవడంలోను, ఎవరి వర్గాన్ని వారు పెంచుకోవడంలోను ఆధిపత్యరాజకీయాలు, వర్గ పోరుకు తెరదీయడంలోనూ బిజీగా ఉన్నారేతప్ప.. పార్టీని పట్టించుకున్నది కనిపించడం లేదు. పైగా.. ఇప్పటికిప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకుని కాయకల్ప చికిత్స చేస్తున్నా.. వైసీపీ దూకుడుకు బ్రేకులు వేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఉన్న సిట్టింగ్ స్థానాలను నిలుపుకొంటే గొప్పనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.