వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌కు లైన్ క్లియర్ అవుతోంది. ఇప్పటి వరకు ఆయనను విమర్శించిన టీడీపీ నేతల నోళ్లకు ఇక తాళం పడనుంది. నిజానికి పెద్ద ఎత్తున టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు జగన్‌ను నిన్న మొన్నటి వరకు లక్ష కోట్లు దోచుకున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాయించుకున్నాడు- అని విమర్శించారు. దుమ్మెత్తి పోశారు. అయితే, అనూహ్యంగా ఈ వ్యాఖ్యలకు ఇటీవల కాలంలో దాదాపు నెల రోజులుగా టీడీపీ నాయకులు ఫుల్ స్టాప్ పెట్టారు. ఎక్కడా జగన్ ను విమర్శించినా.. కూడా డబ్బులు దోచుకున్నాడు.. అనే వ్యాఖ్యలను మాత్రం వ్యూహాత్మకంగా తెరమరుగు చేశారు. దీనికి ప్రధాన కారణం.. తెలుగు దేశం నేతలపై ఇటీవల కాలంలో భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం, కీలక నేతలపై సీబీఐ సహా ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏ ఒక్కమాట జగన్‌ను అన్నా కూడా తమకి అవి బూమరాంగ్ మాదిరిగా తగలడం ఖాయమని నాయకులు భావిస్తున్నారు.
అడ్డంగా దొరికిన సుజనా.....
ఇక, ఇప్పుడు తాజాగా జరిగిన ఘటనతో ఇప్పుడు జగన్‌ను అనే ఛాన్స్ పూర్తిగా టీడీపీ నేతలు కోల్పోయినట్టే భావించాలి. చంద్రబాబుకు అనుంగు మిత్రుడిగా, రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించిన సుజనా చౌదరి ఉరఫ్ సత్యనారాయణ చౌదరి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నిన్న, మొన్నటి వరకు కూడా ఆయన కేంద్రంలో చక్రం తిప్పారు. కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. అయితే, ఆయన సంస్థలు సుజనా గ్రూప్.. ఏకంగా 5700 కోట్ల మేరకు ఎగవేశాయని ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. తమను నిలువునా ముంచేశాడని ఒక విదేశీ బ్యాంకు చాలా సంవత్సరాలుగా ఈయనపై కోర్టు ద్వారా పోరాటం సాగిస్తూ ఉంది. వేల కోట్లకు ఎగనామం పెట్టాడు అనేది ఆ బ్యాంకు మోపుతున్న అభియోగం. వాటిని ఎదుర్కొంటూనే ఈ చౌదరి కేంద్రమంత్రిగా దేశానికి సేవలు చేశాడు.
డబ్బా కంపెనీలు పెట్టి.....
అయితే, తాజా పరిణామాలు మాత్రం ఆషామాషీగా కనిపించడం లేదు. సుజనా చౌదరి చుట్టూ భారీ ఎత్తున ఉచ్చు బిగుసుకుంది. డబ్బా కంపెనీల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసిన సంస్థల్లో చాలా మటుకు మనుగడలోనూ లేవని అధికారులు తేల్చేశారు. అంతేకాదు, కేవలం కాగితాలపైనే సాగుతున్న కంపెనీలు కూడా వీటిలో ఉన్నాయని అధికారులు పేర్కొనడం గమనార్హం. సుజనా వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా బ్యాంకులు రూ. 5700 కోట్లు రుణంగా ఇచ్చాయని, అయితే,వాటిని ఆయన పూర్తిగా ఎగవేశారని, దాదాపు 120 కంపెనీల పేరుతో నిర్వహిస్తున్న లావాదేవీలు ఏవీ కూడా స్పష్టంగా లేవని పేర్కొంటూ తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు సుజనాను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని మాజీ అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాలే.. ఇప్పుడు టీడీపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దీంతో ఇప్పుడు జగన్‌ను అనే పరిస్థితి టీడీపీ నేతలకు లేదని, ఇక, ఎట్టి పరిస్థితిలోనూ జగన్‌ను అంటే.. తమకు కూడా ఎదురు విమర్శలు తప్పవని అంటున్నారు. సో.. ఇదీ సుజనా దెబ్బకు టీడీపీ విలవిలలాడిపోతోందన్నమాట!