వైసిపి అధినేత విశాఖ జిల్లాలో సాగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో పేదవర్గాలకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం టిడిపి సర్కార్ పేదలకు కట్టి ఇస్తున్న ఇళ్ళకు సంబంధించి ఆరు లక్షల రూపాయలు మొత్తం ఖర్చు అవుతుంది. ఇందులో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ గా భరిస్తుంది. మిగిలిన 50 శాతం అంటే మూడు లక్షల రూపాయల సొమ్మును నెలకు మూడు వేలరూపాయల చొప్పున 20 ఏళ్లపాటు వాయిదాల రూపంలో లబ్ది దారుడు చెల్లించాలి. రాబోయే ఎన్నికలకు భారీ ఎత్తున సిద్ధం అవుతున్న తెలుగుదేశం ఇప్పుడు పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ళు మంజూరు చేస్తూ ఆ వర్గం ఓటు బ్యాంక్ కొల్లగొట్టనుంది.
జగన్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చారే......
ఈ వ్యూహాన్ని తిప్పికొట్టే క్రమంలో జగన్ మరో అడుగు ముందుకు వేశారు. టిడిపి మీకు ఇళ్ళు ఇస్తుంది తీసుకోండి. కానీ మీరు బకాయి వుండే మూడు లక్షల రూపాయలు మన ప్రభుత్వం అధికారం లోకి వస్తే పూర్తిగా రద్దు చేస్తానంటూ ప్రకటించేశారు. ఈ ప్రకటన ఇప్పుడు అధికారపార్టీకి తలపోటు గా మారనుంది. ఇళ్ళు ఇచ్చారు సరే రుణాలు కట్టక్కర్లేకుండా జగన్ రుణం రద్దు చేస్తాను అన్నారు అని పేదలు నేతలకు షాక్ ఇచ్చే పరిస్థితి ఎదురౌతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోనీ అలాగని పూర్తి ఉచితంగా అంటే ఇప్పటికిప్పుడు అధికారంలో ఉన్నందున ఇప్పటికిప్పుడు రద్దు చేయాలి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా ఇది తక్షణం సాధ్యమయ్యేది కాదు. దాంతో కిమ్ కర్తవ్యం అన్నది పసుపు పార్టీ ముందు వున్న ప్రశ్న.