జ‌గ‌న్ మార్క్ ట్విస్ట్‌... గుంటూరు సీటు...?

Update: 2018-09-18 02:00 GMT

ఏ నిముషానికి ఏం జ‌రుగుతుందో తెలియ‌ని రాజ‌కీయాలు ప్రస్తుతం ఏపీని ప‌ట్టుకుని కుదిపేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాత్రమే కాకుండా మెజార్టీ కూడా ప్రాధాన్యం సంత‌రించుకున్న నేప‌థ్యంలో అధికార, విప‌క్ష పార్టీలు టీడీపీ, వైసీపీ ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. కీల‌క‌మైన గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇవ్వడ‌మే కాకుండా ప్రత్యర్థిని ఘోరంగా ఓడించ‌డ‌మే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా గుంటూరు ఎంపీ సీటుకు విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్ తీసుకున్న నిర్ణయం దీనినే రుజువు చేస్తోంది. వాస్తవానికి ఇక్కడ ప్రస్తుతం గ‌ల్లా జ‌య‌దేవ్ ఎంపీగా ఉన్నారు. జ‌య‌దేవ్ అన్ని విధాలా బ‌లంగా ఉన్నారు.

లావు జనంలోకి వెళ్లే సమయంలో......

అయితే, ఈయ‌న‌ను ఓడించే క్రమంలో జ‌గ‌న్ ఇక్క‌డ బ‌ల‌మైన అభ్యర్థిగా ఉంటాడ‌నే ధీమాతో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినే త లావు ర‌త్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవ‌రాయులును రంగంలోకి దింపారు. దాదాపు టికెట్ కూడా క‌న్ఫర్మ్ చేశారు. దీంతో ఆయ‌న గ‌త కొన్ని నెల‌లుగా ఇక్కడ జోరుగా ప్రజ‌ల‌లో తిరుగుతున్నారు. పార్లమెంటు ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరుగుతూ.. ప్రజ‌ల క‌ష్ట‌సుఖాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను గెలిచిన అనంత‌రం ఇక్కడి వారికి ఏం చేయాల‌నే వ్యూహాన్ని ముందుగానే బ్లూ ప్రింట్ తీసుకున్నారు.

క్యాస్ట్ ఈక్వేష‌న్ల బ్యాలెన్స్‌కేనా....

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం జ‌గ‌న్ లావు సీటును మార్చిన‌ట్టు విశ్వసనీయ వ‌ర్గాల స‌మాచారం. లావును న‌ర‌స‌రావు పేట ఎంపీ స్థానానికి వెళ్లాల‌ని ఆదేశించిన‌ట్టు స‌మాచారం. సామాజిక స‌మీక‌ర‌ణ‌లే ఇందుకు కార‌ణంగా తెలుస్తోంది. గుంటూరులో కాపు వ‌ర్గం కూడా ఎక్కువ గానే ఉన్న నేప‌థ్యంలో ఇక్కడ నుంచి పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు అల్లుడు కిలారు వెంక‌ట రోశ‌య్యకు కేటాయించిన‌ట్టు స‌మాచారం. ఇక్కడ నుంచి కిలారును రంగంలోకి దింప‌డం ద్వారా ఎప్పటి నుంచో ఇక్కడ ఉమ్మారెడ్డి కుటుంబానికి సానుభూతి ప‌రులుగా ఉన్నవారిని త‌న‌వైపు తిప్పుకొనేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మకంగా పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. అలాగే గుంటూరు లోక్‌స‌భ సెగ్మెంట్‌లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క సీటు కూడా కాపుల‌కు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఎంపీ సీటు కాపుల‌కు ఇస్తే... ఏడు సెగ్మెంట్ల‌లో ఉన్న కాపుల్లో మెజార్టీ వ‌ర్గాన్ని త‌న వైపున‌కు తిప్పుకోవ‌చ్చని... రేపు ఇక్కడ జ‌న‌సేన నుంచి ఎవ‌రు బ‌రిలో ఉన్నా... క్యాస్ట్ ఈక్వేష‌న్లు బ్యాలెన్స్ చేసే క్రమంలోనే ఈ మార్పు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

పేట బ‌రిలో లావు.....

ఇక‌, న‌ర‌స‌రావు పేట‌లోనూ ప్రస్తుతం క‌మ్మ వ‌ర్గానికి చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఉన్నందున వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా లావును నిల‌బెట్టాల‌ని నిర్ణయించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ రాయ‌పాటి పోటీ చేయ‌క‌పోయినా వైసీపీ ఇక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేష‌న్ల బ్యాలెన్స్‌కే లావును రంగంలోకి దింపిన‌ట్టు తెలుస్తోంది. న‌ర‌సారావుపేట లోక్‌స‌భ సెగ్మెంట్ ప‌రిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో టీడీపీ ఏకంగా ఐదుగురు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి సీట్లు ఇస్తోంది. వైసీపీ ఒక్క వినుకొండ‌లో మాత్ర‌మే క‌మ్మ‌ల‌కు సీటు ఇచ్చేలా క‌న‌ప‌డుతోంది.తాజాగా చిల‌క‌లూరిపేట‌లో ఇదే వ‌ర్గానికి చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను సైతం త‌ప్పించేశారు. చిల‌క‌లూరిపేట (క‌మ్మ+బీసీ కోటా ), స‌త్తెన‌ప‌ల్లి, పెద‌కూర‌పాడులో కాపుల‌కు సీట్లు ఇచ్చే ఛాన్సులు (ప్రస్తుత స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి చూస్తే ) ఉన్నాయి. దీంతో ఇక్కడ ఎంపీగా లావు బ‌రిలో ఉంటే లోక్‌స‌భ సెగ్మెంట్‌లో బ‌లంగా ఉన్న క‌మ్మల‌ను సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చనే జ‌గ‌న్ లావును న‌ర‌సారావుపేట‌కు పంపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విష‌యంలో లావు నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Similar News