ఇంటి పేరు నిలబెట్టి... జగన్ వెంట నిలబడి...!!!

Update: 2018-11-27 01:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆఖరి మజిలీకి చేరుకున్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. సిక్కోలులో ఇటీవలే తిత్లి తుఫాను బీభత్సం సృష్టించడంతో దాదాపు పది నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం యాభై రోజుల పాటు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 350 కిలోమీటర్ల మేరకు సిక్కోలు జిల్లాలో జరగనుంది. ఇదే చివర జిల్లా కావడంతో ఆయన యాత్రను విజయవంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో చివరిగా జరిగే ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఇచ్ఛాపురానికి క్యాడర్ ను తరలించేందుకు ఇప్పటి నుంచే నేతలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో గెలిచి....

ప్రస్తుతం పాలకొండ నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. గత ఎన్నికలలో ఇక్కడ వైసీపీ యే విజయం సాధించింది. అయితే స్వల్ప ఓట్ల తేడాతోనే ఇక్కడ వైసీపీకి విజయం లభించింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పైన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వాసరాయ కళావతి 1620 స్వల్ప ఓట్లతేడాతోనే నెగ్గడం విశేషం. అయితే తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఈ గిరిజన ఎమ్మెల్యే పడకపోవడం విశేషం. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఆమె జగన్ వెంటే నడుస్తున్నారు. ఇంటిపేరులోనే విశ్వాసం ఉందన్నది అక్కడి ప్రజలు చర్చించుకుంటుండటం కన్పించింది.

స్వల్ప మెజారిటీ రావడంతో...

పధ్నాలుగు సార్లు పాలకొండ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే నాలుగుసార్లు కాంగ్రెస్, నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. మరో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 1983, 1985, 1994, 2004లో ఇక్కడ టీడీపీ గెలిచింది. 2004లో వైఎస్ గాలులు బలంగా వీచినా ఇక్కడ టీడీపీ గెలవడం విశేషం. అలాంటి నియోజకవర్గంలో మరోసారి తమ ఖాతాలోకి వేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులుకు ఇక్కడ డిపాజిట్లు కూడా రాకపోవడం విశేషం. అయితే గత ఎన్నికలలో టీడీపీ ఇక్కడ 53,717 ఓట్లను సాధించిందంటే అక్కడ పసుపు పార్టీ పట్టును కాదనలేం. స్వల్ప మెజారిటీ రావడంతో ఈనియోజకవర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

హోరా హోరీ పోరు తప్పదా?

ఎస్టీ నియోజకవర్గం కావడంతో మరోసారి ఇక్కడ టీడీపీ, వైసీపీలు హోరా హోరీ తలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పాలకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో పెద్దయెత్తున పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు స్వాగతం చెప్పారు. విశాఖ ఎయిర్ పోర్టులో హత్యాయత్నంతర్వాత తొలిసారిగా సిక్కోలులో అడుగుపెట్టడంతో జగన్ ను చూసేందుకు పెద్దయెత్తున పాదయాత్ర వద్దకు తరలి వస్తున్నారు. పాదయాత్రలో జగన్ కు సమస్యలతో కూడిన వినతిపత్రాలను ప్రజలు అందజేస్తున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర ఆఖరి మజిలీకి చేరుకుంది. సిక్కోలులో పది నియోజకవర్గాల్లో పర్యటించనున్న జగన్ కు ఎక్కడికక్కడ పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. మొత్తం మీద సిక్కోలులో కూడా జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కు మంచి స్పందన లభిస్తోంది.

Similar News